హైదరాబాద్: ఇంటర్ మార్కుల వ్యవహారంపై బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల తమ వాదనలు వినిపించాయి. వాదనల అనంతరం హైకోర్టు స్పందిస్తూ ఫెయిల్ అయిన విద్యార్ధుల పేపర్లు రీ వ్యాల్యూష్ చేయాలని కోరింది. అనంతరం తదుపరి  సోమవారానికి వాయిదా వేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలల హక్కుల సంఘం వాదన ఇదే...
ఇంటర్ బోర్డు నిర్వహం వల్ల తెలంగాణలో ఇంటర్ మార్కుల మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఓవైపు విద్యార్థులు తల్లిదండ్రులు, మరోవైపు విపక్షాలు, విద్యార్థి సంఘాలు ఇంటర్ మార్కుల ప్రహసనంపై తీవ్ర ఆగ్రహావేశాలతో రోడ్డెక్కడంతో విషయం తీవ్రరూపం దాల్చిందని పేర్కొంది. రాష్ట్రంలో 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ఇంటర్ బోర్డు ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమని ప్రతివాది తరఫున పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వానను వినిపించారు. దీనిపై న్యాయవిచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.


ఇంటర్ బోర్డు వాదన ఇదే....
దీనిపై త్రిసభ్య కమిటీ వేశామని అదనపు ఏజీ రామచంద్రరావు వివరణ ఇచ్చారు. ఫలితాల్లో గందరగోళంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటూ జీవోను ఆయన సమర్పించారు.


ఇంటర్ బోర్డుపై హైకోర్టు ఆగ్రహం
విచారణ సందర్భంగా  ఇంటర్ బోర్డు వ్యవహార సరళిపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఏజెన్సీ పనితీరుపై మాత్రమే విచారణకు ఆదేశించారని అభిప్రాయపడిన హైకోర్టు.. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. విద్యార్థుల భవిష్యత్తు కు సంబంధించిన కాబట్టి ... రీ వాల్యుయేషన్ పై నిర్ణయం తెలపాలని ఇంటర్ బోర్డును హైకోర్టు గట్టిగా ప్రశ్నించింది.  దీనికి అదనపు ఏజీ సమాధానమిస్తూ రీవాల్యుయేషన్ పై సోమవారం వివరాలు వెల్లడిస్తామని ఈ మార్కుల వ్యవహారం పరిష్కారానికి 2 నెలల సమయం కావాలని కోరారు.


సమయం కోరిన ఇంటర్ బోర్డు
అదనపు ఏజీ వివరణకు న్యాయస్థానం మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ఫలితాల వెల్లడికి నెల రోజుల సమయం పట్టినప్పుడు... 3 లక్షల పేపర్ల ఫలితాలకు రెండు నెలల సమయం ఎందుకుని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలపై సోమవారం చెబుతామని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.