హైదరాబాద్‌‌: మహానగరంలో విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో విష జ్వరాల వ్యాప్తికి కారణమైన దోమలు నివాసాల్లోకి రాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గత కొద్ది రోజులుగా జీహెచ్‌ఎంసీ ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే నగర మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసి అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో నిత్యం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. దోమలకు ఆవాసమైన టైర్లలో, పాత పాత్రల్లో, పగిలిపోయిన కుండల్లో, నిరూపయోగంగా పడి ఉన్న వస్తు, సామాగ్రిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించిన జీహెఎంసి అధికారులు.. ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దోమలను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా ఓ పోస్టర్‌‌ను రూపొందించిన జీహెచ్ఎంసి అధికారులు.. సామాజిక మాధ్యమాల ద్వారా ఆ పోస్టర్‌ను నెటిజెన్స్‌తో పంచుకున్నారు. గదిలో నిమ్మకాయలు, లవంగాలు పెడితే, వాటి వాసన దోమలను పారదోలుతుందని.. అలాగే కొబ్బరి నూనె, నీలం నూనెల మిశ్రమం వాసన, కర్పూరం ఆకుల వాసన కూడా దోమలను మన దరిచేయనీయదని చెబుతూ సదరు పోస్టర్ల ద్వారా నగరవాసులకు అవగాహన కల్పిస్తున్నారు. జీహెచ్ఎంసి వెస్ట్ జోన్ కమిషనర్ హరిచందన ఈ పోస్టర్‌ను ట్వీట్ చేశారు.