హుజూర్‌నగర్‌: హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈసి విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు నామినేషన్ దాఖలు చేసేవారితోపాటు మరో నలుగురు సభ్యులను మాత్రమే కార్యాలయం లోపలికి అనుమతించనున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన ఈసి.. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంకు 100 మీటర్ల వరకూ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొంది. 


హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికవడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలా ఖాళీ అయిన హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికే తాజాగా ఇసి ఉప ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.