హుజూర్‌నగర్ శాసనసభ స్థానానికి ఈ సోమవారం జరిగిన ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్యే ఇక్కడ ప్రధానమైన పోరు నెలకొంది. టీఆర్ఎస్ తరపున 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి బరిలో నిలవగా ఈసారి కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పోటీలో నిలబడ్డారు. ఇక బీజేపి నుంచి కోట రామారావు, టీడీపి నుంచి కిరణ్మయి పోటీచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన అనంతరం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్లే ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, టీపీసీసీ చీఫ్ రాజీనామా చేయడంతో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతోపాటు మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె మధ్య జరుగుతున్న ఎన్నిక కావడంతో హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో విజయం సాధించి ప్రజలు అధికార పార్టీవైపే ఉన్నారని చాటిచెప్పాలనే దృఢ నిశ్చయంతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. సర్వశక్తులు ఒడ్డి ఇక్కడ ప్రచారం చేసింది. మంత్రులు, పార్టీ అగ్రనేతలు చాలామంది హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని సైది రెడ్డి బలం పెంచేందుకు కృషిచేశారు.


ఇదిలావుంటే, హుజూర్ నగర్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ సైతం అంతే సీరియస్‌గా తీసుకుంది. తాను రాజీనామా చేసిన చోట జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతోపాటు అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని చాటిచెప్పాలంటే.. ఇక్కడి నుంచి ఎలాగైనా గెలిచి తీరాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఉప ఎన్నికను ఓ సవాలుగా తీసుకున్నారు. దీంతో ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి గెలుపు కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు హుజూర్ నగర్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది నేతలు ఉత్తమ్‌కి అండగా నిలిచారు.


హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోరు ఎందుకంత రసవత్తరంగా, హోరాహోరీగా జరిగిందో చెప్పాలంటే ఇక్కడ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. గతంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి పలువురు నేతలకు బేదాభిప్రాయాలు ఉండేవనేది మీడియాలో తరచుగా వినిపించే టాక్. అందుకు తగినట్టుగానే పలు సందర్భాల్లో ఉత్తమ్‌తో మాటల యుద్ధానికి దిగిన నేతలు కూడా ఉన్నారు. అయితే, హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయానికొస్తే, కాంగ్రెస్ నేతలంతా తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి.. తమ అభ్యర్థి గెలుపు కోసం ఏకమై ప్రచారంలో పాల్గొనడం విశేషం. దీంతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలకు మధ్య హోరాహోరిని తలపించింది. ఇలా చెప్పుకుంటూపోతే హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎందుకు ఆసక్తిని రేకెత్తిస్తుందో చెప్పడానికి సవాలక్ష విషయాలను ప్రస్తావించొచ్చు. ఈ నేపథ్యంలోనే గురువారం వెల్లడి కానున్న ఫలితాల్లో విజయం ఎవరిని వరించనుందనేదే ప్రస్తుతం ఓటు రాజకీయ పార్టీలను ఇటు ఓటర్లను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది.