హైదరాబాదులో హెల్మెట్ పెట్టుకొని వైద్యం చేసిన డాక్టర్లు
హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలోని వైద్యులు వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలోని వైద్యులు వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపారు. ఇప్పటికే ఆసుపత్రి భవనం చాలా పాతబడిపోయి పెచ్చులూడిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఎప్పుడెప్పుడు సీలింగ్ ఇటుకలు రాలి మీద పడతాయని భయంగా ఉందని.. అందుకే హెల్మెట్లు పెట్టుకొని వైద్యం చేస్తున్నామని పలువురు వైద్యులు తెలిపారు. అందుకే ఈ నిరసన కార్యక్రమంలో తమతో పాటు నర్సులు, ఇతర పారామెడికల్ స్టాఫ్‌ని కూడా భాగస్వాములను చేశామని వైద్యులు తెలిపారు.
గతంలో ఇదే ఆసుపత్రి వైద్యులు ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు లేకపోవడంతో.. వైద్యశాల ప్రాంగణంలోని చెట్ల క్రింద బల్లలు వేసి.. అక్కడ వైద్యం చేసి తమ నిరసనను తెలిపారు. తాజాగా ఈ నిరసనను ప్రారంభించిన ఉస్మానియా ఆసుపత్రి జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే తేరుకొని ఆసుపత్రికి మరమ్మత్తులు చేయకపోతే తాము ఈ నిరసనను ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు. ఒకప్పుడు భారతదేశంలోనే పేరెన్నిక గల ఆసుపత్రుల్లో చోటు దక్కించుకున్న ఉస్మానియా ఆసుపత్రిని ఆఖరు నిజాం అయిన ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు.
ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 250 మంది వైద్యులు ఉండగా.. అందులో 60 మంది ప్రొఫెసర్లు, 190 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు.. 500లకు పైగా నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. అలాగే 800లకు పైగా నాన్-గజిటెట్ ఉద్యోగులు మరియు క్లాస్-IV ఉద్యోగులు ఉన్నారు. 300 మంది హౌస్ సర్జన్లు, 240 నర్సింగ్ విద్యార్థులు కూడా ఈ ఆసుపత్రిలో వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. 1910 సంవత్సరంలో ఈ ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ జెరోమ్ ఈ ఆసుపత్రికి ప్లానింగ్ గీయడం జరిగింది. పూర్తి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ పద్ధతులను ఉపయోగించి ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఇంత ఘనచరిత్ర గల ఆసుపత్రిని నేడు పట్టించుకోకపోవడం బాధాకరమని పలువురు చరిత్రకారులు వాపోతున్నారు.