హైదరాబాద్ మెట్రో రైలు ఖాతాలో మరో రికార్డు
హైదరాబాద్ మెట్రో రైలు ఖాతాలో మరో రికార్డు
హైదరాబాద్ మెట్రో రైలు ఖాతాలో మరో రికార్డు వచ్చిచేరింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇటీవల మెట్రో రైలును ఆశ్రయిస్తున్న ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సోమవారం మెట్రో రైలులో ప్రయాణించిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో 4 లక్షల మార్కు దాటింది. ఇప్పటివరకు 3.75 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడమే మెట్రో ఖాతాలో ఉన్న అత్యధిక రికార్డు కాగా సోమవారం 4 లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించడంతో పాత రికార్డు కాస్తా తుడిచిపెట్టుకుపోయింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడుపుతున్నప్పటికీ.. అన్ని ప్రధాన మార్గాల్లో అవి అరకొర సేవలే అందిస్తున్నాయి. దీంతో నగరంలో దూర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగస్తులు, విద్యార్థులకు ఉన్న ఏకైక మార్గం ఇక మెట్రో రైలే కావడంతో చాలామంది మెట్రో రైలులోనే తమతమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
మెట్రో రైలులో పెరిగిన రద్దీ దృష్ట్యా సోమవారం నాడు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ 4 అదనపు రైళ్ల సహాయంతో 120 అదనపు ట్రిప్పులు నడిపింది. మొత్తంగా 830 ట్రిప్పులు నడపడంతో మెట్రో రైలులో 4 లక్షల ప్రయాణికులకు ప్రయాణం అందించిన రికార్డు సాధ్యమైందని అధికారులు తెలిపారు.