హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు సోమవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2.10లక్షల మంది ప్రయాణికులు నగరంలోని మెట్రో రైళ్లలో ప్రయాణించారు. వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలకు బయల్దేరిన నగర వాసులు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10.30 మధ్య మెట్రోలో ప్రయాణించారు. దీంతో ఆ ఐదున్నర గంటలపాటు మెట్రో రైళ్లలో విపరీతమైన రద్దీ కనిపించింది. భారీగా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మెట్రో రైలు అధికారులు సైతం అన్ని మార్గాల్లోనూ అదనపు రైళ్లు నడిపారు. 


అర్ధరాత్రి 12:30 గంటల వరకు రైళ్లు నడవడంతో ఆ రోజు హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించిన వారి సంఖ్య మొత్తం 2.10 లక్షలకు చేరింది. హైదరాబాద్‌కి మెట్రో రైలు వచ్చిన అనంతరం ఇంత భారీగా రికార్డు స్థాయిలో ప్రయాణికులకు సేవలు అందించడం ఇదే తొలిసారి అని మెట్రో అధికారులు తెలిపారు.