డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మందు బాబుల తీరు మారడం లేదు. పోలీసుల డ్రంకెన్‌ డ్రైవ్ టెస్టుల్లో అనేక మంది పట్టుబడుతూనే ఉన్నారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నాటికి 20,248 డంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ విభాగం తెలిపింది. ఈ కేసుల్లో 3, 056 మందికి జైలుశిక్ష విధించగా.. 1, 055 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశామని అధికారులు తెలిపారు. కాగా డ్రంకెన్ డ్రైవ్‌లో పాతబస్తీకి చేసిన ఒక వ్యక్తికి అత్యధికంగా 90 రోజుల జైలు శిక్ష పడిందని అధికారులు తెలిపారు. ఏడు మందికి 60 రోజులు, 14 మందికి 30 రోజులు, 12 మందికి 20 రోజులు జైలుశిక్ష పడినట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

137 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను కోర్టు శాశ్వతంగా రద్దు చేసినట్లు.. 32 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను ఐదేళ్ల వరకు, 9 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను ఏడేళ్ల వరకు, 50 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను మూడేళ్లు, 140 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను రెండేళ్లు, మరికొంత మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సంవత్సరం వరకు సస్పెండ్ చేసినట్లు ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు.


అత్యధికంగా మలక్‌పేట్‌లో 1,273 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. టోలీ చౌకిలో 990, ఎస్ఆర్ నగర్‌లో 975, పంజాగుట్టలో 935, కాచీగూడలో 929, చిక్కడ్‌పల్లిలో 864, సుల్తాన్ బజార్‌లో 820 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి.


తాజాగా శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌ పరిధిలో అర్ధరాత్రి తర్వాత పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ నిర్వహించారు. ఇందులో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పలువురు పోలీసులకు పట్టుబడ్డారు. దాదాపు 19మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 14 కార్లు, ఐదు బైక్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.