హైదరాబాద్‌ పోలీసు సిబ్బందికి పోలీస్ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఓ శుభవార్త వెల్లడించారు. విశ్రాంతి లేని విధులతో నిత్యం సతమతమవుతున్న నగర పోలీసులకు త్వరలోనే వీక్లీ ఆఫ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు కమిషనర్ తెలిపారు. నగరంలో దశల వారీగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ విధానంను తీసుకొస్తున్నామన్న కమిషనర్.. తొలి దశలో వెస్ట్‌జోన్‌లోని పోలీసు సిబ్బందికి వీక్లీ ఆఫ్‌ ప్రకటించినట్టు స్పష్టంచేశారు. వెస్ట్‌జోన్‌లోని 1367 మంది పోలీసులకు ఇకపై వీక్లీ ఆఫ్‌‌లు వర్తించనున్నాయని తెలిపారు. తర్వాతి దశలో నగరంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరికీ వీక్లీ ఆఫ్ అమలయ్యేలా చూస్తామని కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. 


ఎప్పటి నుంచో వీక్లీ ఆఫ్ పాలసీ కోసం వేచిచూస్తున్న తమకు సీపి అంజనీ కుమార్ చెప్పిన ఈ వార్త నిజంగానే శుభవార్త లాంటిదనే భావన హైదరాబాద్ పోలీసుల్లో వ్యక్తమవుతోంది.