హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్న ట్రాఫిక్ పోలీసులు తాజాగా రాంగ్ రూట్ డ్రైవింగ్‌ని నిరోధించేందుకు సిటీ రోడ్లపైకి ఆటోమేటిక్‌ రాంగ్‌ డైరెక్షన్‌ వైలేషన్‌ క్యాప్చర్‌ సిస్టం (ఏఆర్‌డీవీసీఎస్‌)ను ప్రవేశపెట్టబోతున్నారు. ఏఆర్‌డీవీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌తో రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసే వారిని సులభంగా గుర్తించే వీలు కలుగుతుంది. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సర్వర్‌లో ఏఆర్‌డీవీసీఎస్ సాఫ్ట్‌వేర్‌ని నిక్షిప్తం చేస్తారు. అనంతరం నగరంలో అధికంగా రాంగ్ రూట్ డ్రైవింగ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రాంతాల్లోని నిఘా కెమెరాలకు అనుసంధానిస్తారు. ప్రధాన కూడళ్లు మాత్రమే కాకుండా ఇతర చోట్ల ఈ ఉల్లంఘనలు జరుగుతున్న ప్రాంతాల్లోనూ కొత్తగా కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సర్వర్‌‌తో అనుసంధానిస్తారు. నగర వ్యాప్తంగా 100 చోట్ల ఉన్న నిఘా కెమెరాలన్నీ కంట్రోల్‌ రూమ్‌లోని సర్వర్‌కు అనుసంధానించి ఉండేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 


ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ ఆయా మార్గాల్లో నిర్దేశించిన దిశలో కాకుండా అందుకు వ్యతిరేక దిశలో వచ్చే వాహనాలను గుర్తించి, వాటి ఫొటో తీసి, కంట్రోల్‌రూమ్‌ సర్వర్‌కు పంపుతుంది. అక్కడి నుంచి సంబంధిత విభాగం సిబ్బంది ఈ–చలాన్‌ను తీసి వాహనచోదకుల చిరునామాకు పంపనున్నారు. ఏఆర్‌డీవీసీఎస్‌ వినియోగం కారణంగా ట్రాఫిక్ సిబ్బంది లేని ప్రాంతాల్లోనూ ఇకపై రాంగ్ రూట్ డ్రైవింగ్ కి చెక్ పెట్టే వీలుంది. దీంతో ఇకపై ఎక్కడపడితే అక్కడ చూసే వాళ్లు లేరు కదా అని అడ్డగోలుగా వాహనాలు నడిపే వారి పప్పులుడకవు అని చెబుతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.