మంత్రి శంకర్ అరెస్ట్.. పీడీ యాక్ట్ నమోదు
హైదరాబాద్ జంట కమిషనరేట్లలో దాదాపు 250 కేసుల్లో నిందితుడిగా వున్న ఘరానా దొంగ మంత్రి శంకర్ అరెస్ట్
'మంత్రి శంకర్ అరెస్ట్.. పీడీ యాక్ట్ నమోదు' అనే టైటిల్ చూసి కంగారు పడకండి. ఎందుకంటే ఇక్కడ మీరు కంగారు పడినట్టుగా ఏం జరగలేదు. హైదరాబాద్‌లో తాజాగా పోలీసుల చేతిలో అరెస్ట్ అయిన ఓ ఘరానా దొంగ పేరే ఈ మంత్రి శంకర్. హైదరాబాద్ జంట కమిషనరేట్లలో దాదాపు 250 కేసుల్లో నిందితుడిగా వున్న ఈ ఘరానా గజ దొంగ మరో చోరీ కేసులో మళ్లీ పోలీసులకు చిక్కాడు. మంత్రి శంకర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి 37 తులాల బంగారం, రూ.3.20 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నారు.
గతంలో ఓ దొంగతనం కేసులో అరెస్టైన శంకర్.. అక్టోబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం మళ్లీ దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. దీంతో వరుస దొంగతనాలతో జనాన్ని హడలెత్తిస్తున్న మంత్రి శంకర్ కదలికలపై ఓ కన్నేసిన సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అతడిని అరెస్ట్ చేశారు. పదే పదే నేరాలకి పాల్పడుతున్న శంకర్‌పై పీడీ యాక్ట్ నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.