హైదరాబాద్: ముఖ్యమంత్రి రేసులో తామూ ఉన్నామంటూ మజ్లీస్ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో శుక్రవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన అక్బరుద్దీన్.. కర్ణాటకలో కుమారస్వామి సీఎం అయినప్పుడు మనమెందుకు కాలేమంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మజ్లీస్‌తో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సరిపడా మెజారిటీ లేకున్నా కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటప్పుడు తెలంగాణలో మనమెందుకు కాలేమని అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే మజ్లీస్ ఫ్లోర్ లీడర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


'నవంబరులో ఎన్నికలొస్తున్నాయ్‌ అని.. డిసెంబరులో మళ్లీ సీఎం అవుతానని కేసీఆర్‌ చెప్పారు. నవంబరులో జరిగే ఎన్నికల్లో మనమూ సత్తా చాటుదాం.. డిసెంబరులో కేసీఆర్‌ను అడుగుదాం.. ఏమో!డిసెంబరులో ఫలితాలు వచ్చాక ఎవరి అవసరాలు ఎలా వస్తాయో' అని అన్నారు. 'కుమారస్వామి ముఖ్యమంత్రి కాగలినప్పుడు తెలంగాణలో మన అభ్యర్థి సీఎం ఎందుకు కాలేడు?' అని వ్యాఖ్యానించారు. కుమారస్వామి సీఎం అయినట్టే.. అల్లా దయ వల్ల మనమూ సీఎం అవుతామేమో చూద్దామని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.