భారత ప్రధాని మోదీతో.. తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీలో చర్చించిన అంశాలివే..!
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో వున్న అంశాలను ప్రస్తావించారు. వాటి సత్వర పరిష్కారం, ఆమోదం కోసం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొత్త జోనల్ వ్యవస్థకు వెంటనే ఆమోదం తెలపాల్సిందిగా అభ్యర్థించారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపే విషయంలో జాప్యం జరుగుతుండడం, కొత్త నియామకాలు చేపట్టడంపై ప్రభావం చూపుతున్నదని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి తెచ్చారు.
వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన రూ. 450 కోట్లను వెంటనే విడుదల చేయాలని, అదనపు ఎఫ్.ఆర్.బి.ఎమ్ నిధులను విడుదల చేయాలని, మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన వడ్డీ సబ్సిడీలో, అలాగే రైతులకు ఇవ్వాల్సిన వడ్డీ సబ్సిడిలో కేంద్రం వాటాను విడుదల చేయాలని కోరారు. హైకోర్టును సత్వరంగా విభజించాలని, రీజినల్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయించాలని, జాతీయ రహదారుల విస్తరణ, కొత్త సెక్రేటేరియట్ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ విషయాలపై ఇప్పటికే అనేక సార్లు అటు పార్లమెంటులోనూ, ఇటు ప్రధానమంత్రి వద్ద, మరోవైపు ఆయా శాఖ మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. తాను ప్రస్తావించిన అన్ని అంశాలకు సంబంధించి పరిష్కారం, ఆమోదం లభించేలా చొరవ చూపాలని.. ఆయా మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి ప్రధానిని కోరారు.
అన్ని అంశాలను ప్రస్తావిస్తూనే ఎఫ్.ఆర్.బి.ఎమ్ అదనపు నిధులు, వెనుకబడిన జిల్లాల అభివృధ్ధి నిధులు, రక్షణ శాఖ భూములు కేటాయింపునకు సంబంధించి ముఖ్యమంత్రి వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్ర విభజన బిల్లులో తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున 450 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని హామి ఇచ్చిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. మూడు విడతలుగా నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పిన కేసిఆర్, నాలుగవ విడత రూ. 450 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, మొత్తం 31 జిల్లాల్లో పరిపాలన పరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉన్నందున నిధులను సత్వరం విడుదల చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. నీతి ఆయోగ్ కూడా ఈ నిధులను విడుదల చేయాలని సూచించిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం సూచించిన మేరకు జీ.ఎస్.డి.పి లో మరో అరశాతం అదనంగా ఎఫ్.ఆర్.బి.ఎమ్. నిధులు సమకూర్చాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. జీ.ఎస్.డి.పిలో మూడు శాతానికి లోబడి తెలంగాణ రాష్ట్రం అప్పులు సమకూర్చుకున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రం కాబట్టి 3.5 శాతం వరకు నిధులను అప్పుల రూపంలో తీసుకునే వెసులుబాటును 14వ ఆర్థిక సంఘం కల్పించిన విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పారు.