తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో జరిగిన ఓ సమావేశంలో ఆయన పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడి తానే తెలంగాణను ఇప్పించానని.. అలాంటప్పుడు తాను సీఎం పదవి కోరుకుంటే తప్పేంటని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా తాను రేసులో ఉంటే తప్పేమీ కాదన్నారు.


ఒకవేళ తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడి పదవి ఇచ్చినా తాను చేస్తానని ఆయన తెలిపారు. అలాగే పార్టీలో వస్తున్న అంతర్గత విభేదాలపై కూడా జానారెడ్డి  స్పందించారు. జట్టు సభ్యులు బాగా ఆడితేనే క్రికెట్‌లో మ్యాచ్ గెలవడం జరుగుతుందని.. కెప్టెన్ సెంచరీ కొట్టినంత మాత్రాని ఆట గెలవలేమని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎందరో పేరున్న నాయకులకు తానే రాజకీయంగా గైడెన్స్ ఇచ్చానని జానారెడ్డి తెలిపారు. ఈ రోజు తన ఇంటిలో సీఎల్పీ మీటింగ్ నిర్వహించిన జానారెడ్డి తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాష్ట్ర సమస్యలపై కూడా చర్చించారు.