JP Nadda to Visit Telangana: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత యాత్ర ఈ నెల 16వ తేదీన కరీంనగర్ లో ముగియనున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ బైంసా నుంచి కరీంనగర్ వరకు చేపట్టిన ఈ యాత్ర ముగింపు సభకు బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా హాజరుకానున్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్‌లో జరగనున్న బహిరంగ సభలో జేపి నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొంటారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జేపి నడ్డా పర్యటన షెడ్యూల్ వివరాలు
ఈ నెల 16న, శుక్రవారం నాడు కర్ణాటక నుండి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని అన్నారు. రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు జేపి నడ్డాకు స్వాగతం పలికిన అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే దాదాపు అరగంట పాటు బీజేపి నేతలతో సమావేశం కానున్నారు.


ఆ తరువాత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి కరీంనగర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు హెలికాప్టర్లో బయల్దేరి వెళ్తారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జేపి నడ్డా కరీంనగర్ సభకు చేరుకుంటారు. కరీంనగర్ లో జరగబోయే బీజేపి బహిరంగ సభలో జేపి నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కరీంనగర్ నుండి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తిరిగి హెలిక్యాప్టర్లో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయనే వార్తల నేపథ్యంలో బీజేపి అగ్రనాయకత్వం తెలంగాణలో మెరుపు పర్యటనలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.