JPS Strike Withdrawn: సమ్మె విరమించిన జూనియర్ పంచాయతీ సెక్రటరీలు
Junior Panchayat secretaries Strike: జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తక్షణమే విధుల్లో చేరిన వారే ఉద్యోగులుగా కొనసాగుతారని.. మిగతా వారితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు అని శుక్రవారం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Junior Panchayat secretaries Strike: గత కొన్ని రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తోన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. తక్షణమే విధుల్లో చేరిన వారే ఉద్యోగులుగా కొనసాగుతారని.. మిగతా వారితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు అని శుక్రవారం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా సమ్మెలో కొనసాగే వారని ప్రత్యేకించి ఉద్యోగాల్లోంచి తొలగించేదేమీ లేదని.. కాంట్రాక్ట్ రూల్స్ ప్రకారం ఇప్పటికే వారి ఉద్యోగం కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే వారితో ఈ ఉద్యోగానికి సంబంధం తెగిపోయినట్టు అయ్యిందని ప్రభుత్వం స్పష్టంచేసింది. అంతేకాకుండా ఏ గ్రామంలోనైతే జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉంటుందో.. ఆ గ్రామంలో డిగ్రీ చదువుకున్న వారికి జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు ప్రభుత్వం తమ తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఖాళీగా ఉన్న స్థానాలకు దరఖాస్తు చేసుకున్న వారికి రిజర్వేషన్ ప్రాతిపదికని ఎంపిక చేయనున్నట్టు వెల్లడించింది.
ప్రభుత్వం జూనియర్ పంచాయతీ సెక్రటరీల డిమాండ్లు ఇప్పుడు వినే మూడ్ లో లేకపోవడంతో పాటు.. తక్షణమే విధుల్లో చేరని వారి స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు సైతం వెనుకాడబోమని ప్రకటించిన నేపథ్యంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు తమ సమ్మే విషయంలో పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సమ్మెను విరమించుకుంటున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వంతో మాట్లాడుకుంటాం..
తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో సామరస్యంగా మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకుంటామని జూనియర్ పంచాయతీ సెక్రటరీల సంఘం నేతలు స్పష్టంచేశారు. ప్రస్తుతానికి విధుల్లో చేరుతామని.. తరువాత ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకుంటాం అని జూనియర్ పంచాయతీ సెక్రటరీలు స్పష్టంచేశారు.
పనిచేయని ప్రతిపక్షాల భరోసా..
జూనియర్ పంచాయతీ సెక్రటరీల సమ్మెను ఉక్కుపాదంతో అణిచేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సబబు కాదని ప్రతిపక్షాలు హితవు పలికిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఉద్యోగంలోంచి తీసేస్తామని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడినా.. జూనియర్ పంచాయతీ సెక్రటరీలు భయపడకుండా సమ్మె చేయాల్సిందిగా బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారికి సూచించారు. కేసీఆర్ సర్కారు ఉండేది మరో ఐదు నెలలేనని.. ఆ తరువాత తమ పార్టీ అధికారంలోకి వచ్చాకా మిమ్మల్ని పూర్తిస్థాయి ఉద్యోగులుగా తీసుకుంటాం అని బండి సంజయ్ భరోసా ఇచ్చినప్పటికీ.. జూనియర్ పంచాయతీ సెక్రటరీలు అంతిమంగా విధుల్లో చేరడానికే నిర్ణయించుకోవడం గమనార్హం.