తనపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. కత్తి మహేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్ విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్టు హై కోర్టు స్పష్టంచేసింది. శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కత్తి మహేష్‌ను 6 నెలల పాటు హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరిస్తున్నట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ జులై 9వ తేదీన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే. ఇదే వివాదంలో కత్తి మహేష్‌కు వ్యతిరేకంగా హిందువులను కూడగట్టి హైదరాబాద్‌లో ర్యాలీ తీసేందుకు ప్రయత్నించిన పరిపూర్ణానంద స్వామిని కూడా నగర పోలీసులు 6 నెలల పాటు బహిష్కరించారు. 


హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణకు గురైన ఈ ఇద్దరూ తమపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను వెంటనే ఎత్తివేయాలంటూ హైకోర్టుకు మొరపెట్టుకున్నారు. ఈ ఇద్దరి నగర బహిష్కరణపై వివరణ ఇస్తూ తెలంగాణ పోలీసులు హై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. అఫిడవిట్‌లో తెలంగాణ పోలీసులు పేర్కొన్న వివరాలను పరిశీలించిన అనంతరం హై కోర్టు ఈ పిటిషన్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది.