40 మంది బీసీ ప్రతినిధులతో కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేసేలా ప్రభుత్వం యోచన చేస్తుందని.. వచ్చే బడ్జెట్‌లో బీసీల కోసం ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉందని ఈ భేటీలో ముఖ్యమంత్రి తెలిపారు. అంతేకాకుండా బీసీ ఫెడరేషన్లు మళ్లీ ప్రారంభించేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. బీసీ విద్యాసంస్థలకు రుణాలు మంజూరు కూడా చేస్తామన్నారు.
అదే విధంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ ఎలా పనిచేయాలన్న అంశంపై బీసీ ప్రతినిధులు ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందజేయాలని సీఎం కోరారు. బీసీల క్రిందకు వచ్చే నాయీ బ్రాహ్మణులకు 250 కోట్లు, రజకులకు 250 కోట్లు, ఎంబీసీలకు 1000 కోట్లు కేటాయించటంపై ప్రత్యేక చర్చ చేయాల్సి ఉందన్న విషయం కూడా ఈ మీటింగ్‌లో ప్రస్తావనకు వచ్చింది.
‘‘బీసీల సంక్షేమం కోసం సర్కారు ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావం అయ్యే నాటికి రాష్ట్రంలో బీసీల కొరకు కేవలం 19 రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా 123 రెసిడెన్షియల్ స్కూళ్లు వచ్చాయి. వీటి ద్వారా 91,520 మంది బీసీ పిల్లలకు మంచి ప్రమాణాలతో కూడిన విద్యా అందుతోంది. రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను ఇంకా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ’’ అని కూడా ఈ మీటింగ్‌లో సీఎం తెలిపారు