తెలంగాణలో మరో సమరానికి సై అన్న కేసీఆర్
తెలంగాణలో అద్భుత విజయం సాధించిన కేసీఆర్ ఇప్పుడు మరో గెలుపుపై గురిపెట్టారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతుంటే.. కేసీఆర్ మాత్రం మరో సమరంపై గురిపెట్టారు. టీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ కేసీఆర్ మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు.
తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. వారం రోజుల్లో పంచాయతీ రాజ్ ఎన్నికలపై నోటిఫై చేస్తామన్నారు. అయితే ఈ ఎన్నికలపై హైకోర్టు తీర్పును అమలు చేయాల్సి ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నేతలను ఆదేశించినట్టు కేసీఆర్ వెల్లడించారు.
దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవాలనే చందంగా టీఆర్ఎస్ పట్ల అనుకూల వాతావరణం ఉన్న ఇదే తరుణంలో పంచాయితీ ఎన్నికలకు పోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఇలా అసెంబ్లీ ఫలితాలు వచ్చిన వెంటనే మరో ఎన్నికల శంఖారావం పూరించేందుకు కేసీఆర్ సిద్ధపడ్డారు