తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం నిజామాబాద్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని, 100 సభల్లో పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేసీఆర్.. మధ్యాహ్నం 3 గంటలకు ఉమ్మడి నిజామాబాద్‌లోని ఇందూరులో జరిగే ‘ప్రజా ఆశీర్వాద’ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మహాకూటమే లక్ష్యంగా ఆయన విపక్షాలపై ధ్వజమెత్తనున్నారు. అనంతరం అక్టోబర్ 4న  నల్గొండ, అక్టోబర్ 5న వనపర్తి, అక్టోబర్ 7న వరంగల్‌, అక్టోబర్ 8న ఖమ్మం సభలకు కేసీఆర్‌ హాజరవ్వనున్నారు. కాగా ఇందూరులో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది టీఆర్ఎస్ పార్టీ.  


గతనెలలో కేసీఆర్ తెలంగాణ శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. భారత ఎన్నికల సంఘం త్వరలోనే ఎన్నికల తేదీలను ప్రకటిస్తుంది.


కాగా 2014లో తెలంగాణ రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 63 స్థానాలను కైవసం చేసుకుంది.