మహకూటమి ఓటమికి ఆయనే కారణం : కోదండరాం
తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఓటమిపై కోదండరాం కామెంట్స్
తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ, ఫలితాల వెల్లడి అనంతరం సంబరాల్లో మునిగితేలుతోంటే, ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసి ఓటమిపాలైన మహాకూటమి నేతలు మాత్రం ఓటమి వెనుకున్న కారణాలను విశ్లేషించుకుంటున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం వివిధ టీవీ ఛానెళ్లు, పేపర్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన మహాకూటమి నేతలు.. తమ ఓటమికి గల కారణాలు ఏంటనే విషయంలో ఎవరికి వారే తమకు తోచిన అభిప్రాయాలు చెబుతూ వస్తున్నారు. మహాకూటమిలో భాగస్వామి అయిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం సైతం కూటమి ఓటమికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించే క్రమంలో.. ఏపీ సీఎం చంద్రబాబుపై పలు సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్టుగా కూటమి ఓటమికి కూడా అన్నేసి కారణాలున్నాయని చెప్పే క్రమంలో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూడా అందులో ఒకటి కోదండరాం అని చెప్పినట్టు సమాచారం. వన్ఇండియా ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. తెలంగాణలో మహకూటమి తరపున చంద్రబాబు ప్రచారంలో పాల్గొనడంతో ఆ తర్వాత ఎన్నికల సమరం అంతా చంద్రబాబు vs కేసీఆర్ అన్నట్టుగా మారిందని, దీంతో వార్ కాస్తా మహాకూటమికి కేసీఆర్‌కు మధ్య కాకుండా చంద్రబాబుకు కేసీఆర్‌కు మధ్య జరుగుతోందనే విధంగా కేసీఆర్ చిత్రీకరించారని కోదండరాం అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయడాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మల్చుకుని ఆయన గెలుపొందారని కోదండరాం విశ్లేషించినట్టుగా ఆ కథనం పేర్కొంది. ఇలా నిత్యం ఏదో ఓ చోట మహకూటమి ఓటమిపై చర్చ జరుగుతూనే వుంది.. ఎవరి అభిప్రాయాలు వాళ్లు వెల్లడిస్తూనే వున్నారు.