ఉత్తమ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నల్గొండ: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే కానీ కాంగ్రెస్ కాదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. టీపీసీసీ చీఫ్ పదవి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటేనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందని కోమటిరెడ్డి హితవు పలికారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, అలాగే రామేశ్వర రావుతోనూ ఉత్తమ్‌కు సంబంధాలు ఉన్నాయని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. టీ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు చేసి పార్టీని భ్రష్టు పట్టించారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అదే కారణం:
ఇతర పార్టీలతో పొత్తులు, తెలంగాణలో కాంగ్రెస్‌కి మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేసిన కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు. నాయకత్వం లోపించిన కారణంగానే కాంగ్రెస్ ఈ దుస్థితికి దిగజారిందని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను గాంధీభవన్ నేతను కాదని.. ప్రజల మనుషులమని చెబుతూ ప్రజలే కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులిస్తారని పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తోంటే, ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి నోటీసులు అందుకున్న ఆయన ఆ పార్టీని వీడి బీజేపిలో చేరడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.