హైదరాబాద్: హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతి పేరును ప్రకటించడంతో టీ కాంగ్రెస్ నేతల్లో మొదలైన మాటల యుద్ధం మరింత ముదురుతోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడం ఏంటంటూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభ్యంతరాలు చెప్పిన సంగతి తెలిసిందే. అంతటితో ఊరుకోని రేవంత్ రెడ్డి... ఉత్తమ్‌పై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని సంచలన ప్రకటన చేశారు. 


అయితే, ఈ వ్యవహారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ నేత, సహచర ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి మద్దతు లభించింది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పలు బహిరంగ వేదికలపై అసంతృప్తి వెళ్లగక్కిన కోమటిరెడ్డి.. ఈసారి ఉత్తమ్‌కి అండగా నిలుస్తూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించడంపై పీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పడమేంటని ప్రశ్నించిన ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. తమ జిల్లాలో రేవంత్ పెత్తనం ఏంటని మండిపడ్డారు. అంతేకాకుండా పద్మావతి పోటీచేయాలని అందరూ కోరుకుంటున్నారని కోమటి రెడ్డి అన్నారు. పార్టీలో పదవులు వచ్చినా రాకపోయినా తాను మాత్రం పార్టీ కోసమే పనిచేస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి చేసిన ప్రకటన ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే మరి.