ఆదిలాబాద్ గిరిజన ప్రాంతంలో జన్మించి.. గోండు తెగకు నాయకుడిగా ఎదిగి.. ఆసిఫ్‌జాహీ రాజ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి.. నిజాం సామ్రాజ్యానికి పక్కలో బల్లెమై తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన వీరుడే కొమురమ్ భీమ్. ఈ రోజు ఆయన వర్థంతిని పురస్కరించుకొని ఆదివాసీల ముద్దుబిడ్డ భీమ్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

22 అక్టోబరు 1901 తేదీన ఆదిలాబాద్‌లోని ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో గోండు తెగకు చెందిన చిన్నూం, సోంబాయి దంపతులకు జన్మించాడు కొమురం భీమ్. అతని పదిహేడేళ్ళ వయసులోనే తన తండ్రి సాగుచేసుకుంటున్న భూమిని నైజాం జమీందార్లు ఆక్రమించుకోవడంతో వారికి ఎదురునిలిచి పోరాడింది భీమ్ కుటుంబం. ఆ పోరాటంలో తండ్రిని కోల్పోయిన భీమ్, బతుకుదెరువు నిమిత్తం అస్సాం వెళ్లిపోయి అక్కడ తేయాకు తోటల్లో కొన్నాళ్లు పనిచేశాడు. ఆ తర్వాత మహారాష్ట్ర వెళ్లి చదవడం,రాయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన గ్రామానికి తిరిగి వచ్చి, పెత్తందార్ల చేతిలో బలైపోతున్న తన తోటి గిరిజన మిత్రులకు బాసటగా నిలిచాడు. జోడేఘాట్ కేంద్రంగా గెరిల్లా దళాలకు నాయకత్వం వహించాడు.


అప్పటికే పశువుల కాపర్లపై సుంకాన్ని విధిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా ప్రజాపోరాటం చేశాడు భీమ్. భీమ్ స్ఫూర్తితోనే బిర్సాముండా, సంతాలుల తెగలకు చెందిన గిరిజనులు కూడా సాయుధపోరాటంలో పాల్గొన్నారు. "జల్.. జమీన్.. జంగిల్" అన్నదే అప్పుడు వారి నినాదం. ఆ తర్వాత భీమ్ స్ఫూర్తితో 12 గ్రామాల ఆదివాసీలు ఏకమై స్వతంత్ర రాజ్యం కోసం పోరాటం చేశారు. అయితే నిజాం ప్రభువులు స్పందించలేదు. అప్పుడు నైజాంసేనలను ఎదుర్కోవడానికే భీమ్ సేనలు సంకల్పించాయి. చివరకు గిరిజన భూములుకు పట్టాలు ఇస్తామని సర్కారు ప్రకటించింది. అయితే సుంకాలు లేని సర్వాధికార స్వయంప్రతిపత్తి ఆదివాసీ గ్రామాలకు కావాల్సిందేనని తేల్చిచెప్పాడు భీమ్. 


ఆ సమయంలో ఆదివాసీల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న భీమ్‌‌ను ఎదుర్కోవడం నైజాం ప్రభువులకు కష్టసాధ్యమే అనిపించింది. అందుకే బ్రిటీష్ సేనల సహకారం తీసుకుంది. పట్నాపూర్, బాబెఝరి, నర్సపూర్, కల్లెగాం, చాల్‌బడి, బోయికన్ మోవాడ్, భోమన్‌గొంది, భీమన్‌గొంది, అంకుసాపూర్, దేవునిగూడ మొదలైన గిరిజనప్రాంతాలకు చెందిన అటవీ అధికారులు బ్రిటీష్ ప్రభుత్వానికి భీమ్‌పై ఫిర్యాదులు చేశారు. అయితే ఆదివాసీల సమస్యల పరిష్కారానికి, సదుపాయాల కల్పనకు, వారి జీవన విధానంపై పరిశోధన చేసి నివేదిక సమర్పించటానికి ఇంగ్లాండ్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ హేమన్‌డార్ఫ్‌ను బ్రిటీష్ ప్రభుత్వం నియమించింది. కాకపోతే ఆ నివేదిక వచ్చేలోపే పరిస్థితులు తారుమారయ్యాయి. 


ఆదివాసీలు ప్రధానంగా కష్టపడి అడవి నరికి పోడు వ్యవసాయం చేసేవాళ్లు. రాత్రింబవళ్లు కాపుగాస్తూ  పంటలు పండించేవాళ్లు. ఆ తర్వాత పంటను కొట్టిన కల్లంలోనే.. కైలు కింద గింజలు ప్రభుత్వానికి అప్పజెప్పేవారు. అంత కష్టపడి పనిచేసినా గిరిజనులు పోడు చేసుకునే భూములకు పట్టాదారులుగా ఇతర పెత్తందార్లు ఉండేవారు. గిరిజనులు ఎంతటి దట్టమైన అడవిలో భూములను సాగుచేసి, పంటలు పండించినా వాటిపై తమకే పట్టాలు ఉన్నాయని కొందరు వాదించేవారు. తిరగబడ్డ గిరిజనులపై కేసులు పెట్టేవాళ్లు. ఇలాంటి సంఘటనలే కొమురం భీంను కదిలించాయి. ఇలా పంట వసూలు కోసం తమ చేనులోకి వచ్చి కూర్చున్న కొందరికి ఎదురుతిరిగాడు భీమ్. వారికి అండగా నిలిచే నిజాం ప్రభుత్వాన్ని తూర్పారపట్టేవాడు. గిరిజనులు చదవడం, రాయడం నేర్చుకొని, తమ హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నించాలని వారిలో చైతన్యం తీసుకొచ్చేవాడు. కానీ ప్రభుత్వం అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేసింది. ఆదివాసీ గ్రామాల్లోనే రోజుకో చోట నివసిస్తూ.. ఉద్యమాలను నడిపిన భీమ్‌ స్థావరాన్ని కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం, బ్రిటీష్ సేనల సహాయంతో 1940 అక్టోబర్ 27 న జోడేఘాట్ అడవుల్లో  భీమ్ వర్గాన్ని ముట్టడించింది. భీమ్ అనుయాయులు ప్రభుత్వ సేనలతో వీరోచితంగా పోరాడారు. కానీ వారి భారీసేన ముందు భీమ్ బలం చాలలేదు. ఫలితంగా ఆ సేనల చేతిలోనే భీమ్ అసువులుబాసాడు.


కొమురం భీమ్ తెలంగాణలోని ఆదివాసీల ఉద్యమాన్ని నడిపిన తీరు ఆ తర్వాత ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం కొమురం భీమ్ నడయాడిన ఆసిఫాబాద్ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించింది. దానిని కొమురం భీమ్ జిల్లాగా పేర్కొంది. అలాగే ప్రతీ సంవత్సరం కొమురం భీమ్ వర్థంతిని ప్రభుత్వమే అధికారికంగా జరుపుటకు శ్రీకారం చుట్టింది.