KTR Appeal To Public: ఏ ఎన్నికయినా హైదరాబాద్‌ ప్రజలు ఓటింగ్‌పై పెద్దగా శ్రద్ధ చూపరు. ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడంతో ఎన్నిక ఎన్నికకు పోలింగ్‌ శాతం తగ్గుతోంది. ఇది గ్రహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ ప్రజలకు కీలక సూచనలు చేశారు. వీకెండ్‌ ఉంది కదా అని టూర్లకు పోతా అంటే మీ ఇష్టం.. మీరే నష్టపోతారని కేటీఆర్‌ హెచ్చరించారు. ప్రతిఒక్కరూ ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KTR Vs Revanth: చీర నువ్వు కట్టుకుంటావా లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? రేవంత్‌కు కేటీఆర్‌ కౌంటర్‌


లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌ లోక్‌సభ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్‌కు మద్దతుగా రాంనగర్‌ చౌరస్తాలో కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 'కాంగ్రెసోళ్లు ఎన్ని హామీలిచ్చిన మీరు నమ్మలేదు.గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు' అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గుర్తుచేశారు. 'అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెసోళ్లు అధికారంలోకి వచ్చారు. సిగ్గులేకుండా రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేసినా అని హోర్డింగ్‌లు పెట్టుకున్నాడు' అని రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు.

Also Read: Rahul Vs Modi: రిజర్వేషన్లపై నా సవాల్‌కు ప్రధాని మోదీజీ సిద్ధమా? రాహుల్‌ ప్రశ్న


 


నిర్మల్‌ సభలో రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగంపై కేటీఆర్‌ స్పందిస్తూ.. 'పాపం రాహుల్ గాంధీకి ఏమీ తెలియదు.. ఏమీ తెలియదన్న విషయం కూడా ఆయనకు తెల్వదు' అని ఎద్దేవా చేశారు. 'రాహుల్ గాంధీతో కూడా మహిళలకు రూ.2,500 ఇస్తున్నట్లు అబద్దాలు చెప్పించారు' అని తెలిపారు. వృద్ధులకు రూ.4 వేలు, తులం బంగారం, నిరుద్యోగ భృతి, స్కూటీలు వచ్చాయా? అని రోడ్డు షోకు వచ్చిన ప్రజలను ప్రశ్నించారు. మొన్న కాంగ్రెస్‌కు ఎట్ల బుద్ది చెప్పారో మళ్లీ వాళ్లకు సిగ్గు వచ్చేలా లోక్‌సభ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.


స్థానిక ఎంపీ, బీజేపీ అభ్యర్థి కిషన్‌ రెడ్డిపై కేటీఆర్‌ విమర్శల ధాటి పెంచారు. 'కిషన్ రెడ్డి కేంద్రమంత్రయి ఐదేళ్లయ్యింది.. పైసా తెచ్చిండా? కరోనా టైమ్‌లో పేదవాళ్లకు పద్మారావు గౌడ్ భోజనం పెడితే.. కిషన్ రెడ్డి కుర్‌కురే ప్యాకెట్లు పంచిండు. ముషీరాబాద్‌కు, సికింద్రాబాద్‌కు ఒక్క రూపాయి రాలే.. ఒక్క అభివృద్ధి పనిచేయాలే' అని తెలిపారు.


ప్రజలకు కేటీఆర్‌ ఒక ఉపాయం చెప్పారు. 'కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా. మాకు 10-12 సీట్లు ఇస్తే చాలు.. మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారు' అని ప్రకటించారు. కొత్త పెట్టుబడులు తెచ్చే మొఖం లేదు.. ఉన్న పెట్టుబడులు కాపాడే తెలివిలేదని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.


ఈ దుర్మార్గుల చేతిలో రాష్ట్రం ఆగమైపోతోందని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీపై విమర్శలు చేస్తూ.. 'గుడి కట్టుడు ఒక్కటే ఓటు వేసేందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదాద్రి. దేవుడిని  అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నామా? కేసీఆర్ కాళేశ్వరం లాంటి ఆధునిక దేవాలయం కట్టిండు. రిజర్వాయర్లు, చెరువులు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసిండు. వాటికి కూడా మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, రాజరాజేశ్వర సాగర్, కొండపోచమ్మ సాగర్ అని దేవుళ్ల పేరు పెట్టిండు. దేవుళ్లకు సేవ చేయటమే గొప్ప పని అయితే.. కేసీఆర్ కన్నా గొప్ప పని ఎవరు చేసిన్రు' అని ప్రశ్నించారు.


'ఒక్క ఆలయం కట్టినందుకే మోడీకి ఓటు వేస్తే.. మరి యాదాద్రితో పాటు ఆధునిక దేవాలయాలు కట్టినందుకు కేసీఆర్ ఓటు వేయొద్దా?' అని కేటీఆర్‌ నిలదీశారు. పదేళ్లలో ప్రధాని చెప్పుకోవటానికి చేసిన ఒక్క పని అయినా ఉందా? అని అడిగారు. పప్పు, ఉప్పు, చింతపండు నూనె ధరలు పెరిగినయ్.. అందుకే ఈయన పిరమైన ప్రధాని అంటున్నారని తెలిపారు. 'అబ్ కీ బార్ 400 అంటున్నారు.. మళ్లీ మోడీ గెలిస్తే పెట్రోల్ ధరలు రూ.400 అవుడు ఖాయం. క్రూడ్ ఆయిల్ ధర తగ్గిన తర్వాత కూడా పెట్రోల్, డిజీల్ ధరలు ఎందుకు పెరిగినయ్' అని వివరించారు.


'పేదోన్ని కొట్టి పెద్దలకు పెట్టుడే మోడీ పని. ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారని మాట్లాడుతున్నాడు. పదేళ్లు పనిచేసిన ప్రధాని ఇలా మాట్లాడొచ్చా? ఒకసారి పుల్వామా పేరుతో ఓట్లు.. ఇప్పుడు శ్రీరాముడి పేరుతో ఓట్లు. రాముడు రాజధర్మం పాటించాలని చెప్పిండు.. మరి రాజధర్మం పాటించినవా? గుజరాత్‌కు వరదలు వస్తే రూ.వెయ్యి కోట్లు ఇస్తవ్.. హైదరాబాద్‌కు ఎందుకు ఇవ్వవు. ఇదేనా రాజధర్మం' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.


తాము 36 ఫ్లై ఓవర్లు కడితే ఇచ్చిన రెండు ఫ్లై ఓవర్ కట్టుడు చేతకాలేదు అని కేటీఆర్‌ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గతంలో రెండు సీట్లు ఇస్తేనే కేసీఆర్ తెలంగాణను తెచ్చారని గుర్తుచేశారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టింది.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకే పోతుందని హెచ్చరించారు. సెక్యులర్ పార్టీ బీఆర్ఎస్.. సెక్యులర్ లీడర్ కేసీఆర్ అని ప్రకటించారు. ప్రజలంతా బయటకు వచ్చి.. మరికొందరితో తప్పక ఓటు వేయించాలని కేటీఆర్‌ సూచించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter