Police Attack On Zee Telugu: జీ తెలుగు న్యూస్‌పై పోలీసుల దాడిని రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు ఖండించారు. వారితోపాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జర్నలిస్టు సంఘాల నాయకులు ముక్తకంఠంగా వ్యతిరేకిస్తున్నారు. జీ మీడియాపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛాపై దాడిగా అభివర్ణించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Police Attack On Zee Telugu: జీ మీడియాపై పోలీస్ జులుం.. రిపోర్టర్‌ను గల్లా పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు


జర్నలిస్ట్‌లపై పోలీసుల వైఖరిని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఖండించారు. ఉస్మానియాలో పోలీసులు అరెస్ట్ చేసిన జీ న్యూస్ జర్నలిస్ట్ ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తే సహించేది లేదంటూ ప్రభుత్వానికి హెచ్చరించారు. రాష్ట్రంలో జర్నలిస్ట్ లపై పోలీసులు వ్యవహారిస్తున్న తీరుపై ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాపాలనలో జర్నలిస్టులకు కూడా రక్షణ లేదా అని ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా ఓయూలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనను కవర్ చేస్తున్న జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్‌, కెమెరామెన్‌లను అక్రమంగా అరెస్ట్ చేయటం దారుణమని మండిపడ్డారు. జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా ? డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే తప్పా అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Also Read: DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్‌.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన


దీంతోపాటు ఇటీవల జర్నలిస్టులపై పోలీసులు చేసిన దాడులను కేటీఆర్‌ గుర్తు చేశారు. మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం కవరేజ్‌ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన... ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జీన్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్ట్‌లను ఖండించారు. ఇందిరమ్మ రాజ్యమంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమేనా అని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియాలో మళ్లీ ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 


మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్లకంచెలు, అడగడుగునా దర్శనమివ్వటం చూస్తుంటే విద్యార్థులు మరో ఉద్యమంతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పటం ఖాయమన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే సహించే ప్రసక్తే లేదని కేటీఆర్‌ హెచ్చరించారు. జర్నలిస్టులపై పోలీసుల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ జర్నలిస్ట్ యూనియన్లు చేసే పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.


హరీశ్‌ రావు ఖండన
ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. జీ తెలుగు న్యూస్‌ రిపోర్టర్‌పై పోలీసుల దాడిని ఖండిస్తూ 'ఎక్స్‌' వేదికగా హరీశ్‌ రావు స్పందించారు. 'డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా?' అని ప్రశ్నించారు. 'జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే' అని పేర్కొన్నారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.



 


 






స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter