హైదరాబాద్ నిజాంపేటలో జరిగిన ‘మన హైదరాబాద్‌ - మనందరి హైదరాబాద్‌ ’ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో నివసించే కోస్తా, రాయలసీమ ప్రజలకు తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని ఆయన మాటిచ్చారు. రెండు రాష్ట్రాల నాయకుల మధ్య వైరుధ్యాలున్నా.. ప్రజల మధ్య, వ్యవస్థల మధ్య వైరుధ్యాలు ఉండకూడదని ఆయన అన్నారు. జాతీయ పార్టీల నాయకులకు రాష్ట్రాలంటే చిన్నచూపు అని.. ఈ పరిస్థితి మారాలి అని అన్నారు. గతంలో మాదిరిగా హైదరాబాద్ నగరం లేదని.. ఇప్పుడు ఈ నగరంలో అందరూ సురక్షితంగా ఉండవచ్చని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం తాము హైదరాబాద్ బాగు కోసం శ్రమిస్తున్నామని.. నగరంలో భద్రత కోసం 10 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కూడా రంగాన్ని సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ కొన్ని పార్టీలు టీఆర్ఎస్‌ను గద్దె దించడానికి ప్రయత్నిస్తున్నాయని..కానీ అది అసాధ్యమని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లేని ఆక్సిజన్‌ను ఎందుకు ఎక్కిస్తున్నారో తనకు అర్థం కావడం  లేదన్నారు. కానీ.. తాము మాత్రం ఆంధ్ర ప్రజలు బాగుండాలని కోరుకుంటూ ఉన్నామని.. ఏపీలో ఏ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు సంతోషమేనని కేటీఆర్ అన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారంటే తమకు  ఎంతో గౌరవమని.. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు వారి అస్తిత్వాన్ని కాపాడడానికి ఆవిర్భించిన పార్టీ అని కేటీఆర్ తెలిపారు. అయితే తెలంగాణలో ప్రస్తుతం అదే పార్టీలోని మెజారిటీ శాతం నాయకులు టీఆర్ఎస్‌లోకి వచ్చేశారన్నారు. దానికి కారణం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్న భావనే అని కేటీఆర్ అన్నారు. 


తెలంగాణ విషయంలో కేసీఆర్ ఇప్పటికే పేదల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని.. ఆయనకు ఎవరికీ అన్యాయం చేసే మనస్తత్వం లేదని కేటీఆర్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణం బీజేపీ ప్రభుత్వమేనని.. అది కాదనలేని సత్యమని కేటీఆర్ అన్నారు. అలాగే 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ అనేక చోట్ల తాగునీటి సమస్యలను కూడా పరిష్కరించలేకపోతుందని తెలిపారు. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజల అవసరాలను గుర్తించే పార్టీ అని.. తమకు కూడా ప్రజా సమస్యలను పరిష్కరించడమే తొలి కర్తవ్యమని కేటీఆర్ అన్నారు.