తెలంగాణ పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారకరామారావు) ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పరిపాలన పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తు్న్నారని ఆయన తెలిపారు. అలాగే కొందరైతే టీఆర్‌ఎస్ పార్టీ శాఖ ఏపీలో కూడా పెడితే బాగుంటుందని తెలిపారని అన్నారు. మధిర ప్రాంతంలో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రాంతానికి గతంలో కాంగ్రెస్ లేదా టీడీపీ నేతలు ఎలాంటి నిధులు కూడా కేటాయించకపోవడం శోచనీయమని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధికారంలోకి వచ్చాక భారీ స్థాయిలో నిధులు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. అలాగే వృద్ధులకు ప్రత్యేకంగా రూ.1000 పెన్షన్ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఇదే సభలో ఆయన కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. 


కాంగ్రెస్‌ది మోసపూరితమైన చరిత్ర అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. స్వాత్రంత్యం తెచ్చినప్పటి కాంగ్రెస్ నాయకులు వేరని.. ఇప్పటి కాంగ్రెస్ నాయకులు వేరని ఆయన అభిప్రాయపడ్డారు. మధిరలో గులాబీ జెండా ఎప్పటికీ ఎగరాలన్నదే తమ ఆకాంక్ష అని.. మిషన్ భగీరథతో ఇప్పటి కేసీఆర్ ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేశారని.. తాగునీటి అవసరాలతో పాటు రైతాంగ అవసరాలు తీర్చడానికే టీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.