హైదరాబాద్: తెలంగాణలో టీడీపి, కాంగ్రెస్ వంటి పార్టీలకు వరుస షాక్‌లు ఇస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్‌కి ఆ పార్టీ ఎంపీనే షాక్ ఇవ్వబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక వెల్లడించిన ఓ కథనం ప్రకారం లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత అయిన జితేందర్ రెడ్డితో బీజేపి సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గెలిచిన జితేందర్ రెడ్డికి ఈసారి అక్కడి నుంచి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో తన రాజకీయ భవితవ్యంపై ఆలోచనలో పడిన జితేందర్ రెడ్డిని ఇదే అదనుగా తమ పార్టీలోకి ఆహ్వానించాలనే ప్రయత్నాల్లో భాగంగా బీజేపి నేత రాంమాధవ్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్టు ఆ కథనం పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1999లో బీజేపీ తరపునే గెలిచిన జితేందర్ రెడ్డి ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో బీజేపిని వీడి టీడిపిలో, అనంతరం టీఆర్ఎస్‌లో చేరారు. అలా గతంలోనే బీజేపీ తరపున లోక్ సభకు ఎన్నికైన నేతగా పేరుండటంతో ఆయన్ను తిరిగి బీజేపీలోకి తీసుకురావాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. బీజేపీ తనను సంప్రదించిన క్రమంలో ఆయన కూడా కొన్ని షరతులను ప్రస్తావించగా, పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడి చెబుతానని రాంమధవ్ బదులిచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఇదే విషయమై సదరు పత్రిక జితేందర్ రెడ్డి వివరణ కోరగా.. '' పార్టీ మారే యోచనలో తాను లేనని, అలాంటిదేమైనా వుంటే తానే వెల్లడిస్తాను'' అని ఆయన చెప్పినట్టు ఆ వార్తా కథనం స్పష్టంచేసింది. 


ఇవన్నీ ఇలా వుంటే, ఈనెల 29న మహబూబ్‌నగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సభ నిర్వహించనుండగా, అదే రోజు అదే సభా వేదికపై జితేందర్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్టు అనేక ఇతర వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.