Police Harassments: పోలీసులు బీఆర్ఎస్ ప్రవేటు సైన్యమా ?
Mallu Bhattivikramarka`s open letter to KCR: రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది ప్రజలపై పోలీసులు పెడుతున్న వేధింపులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రాసిన బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు.
Mallu Bhattivikramarka's open letter to KCR: రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది ప్రజలపై పోలీసులు పెడుతున్న వేధింపులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రాసిన బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు. గురువారం దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం నక్కలగండి ప్రాజెక్టు పాదయాత్ర శిబిరం వద్ద లేఖ విడుదల చేసిన సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి మార్చి 16న పీపుల్స్ మార్చ్ చేపట్టి దేవరకొండ వరకు అనేక జిల్లాలు నియోజకవర్గాలు వందల సంఖ్యలో గ్రామాలు కాలినడకన తిరిగిన సందర్భంగా వందలాది మంది ప్రజలు క్షేత్రస్థాయి పోలీసులు పెడుతున్న వేధింపులు, ఇబ్బందులను నా దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుల ఆదేశాలను అమలు చేస్తూ బిఆర్ఎస్ పార్టీకి ప్రైవేటు సైన్యంగా మారిందని మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులైన డిజిపి, ఐజి, డిఐజి, ఎస్పీ లాంటి అధికారులతో క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు డీ లింకు అయ్యి ఉన్నతాధికారులు చెప్పినట్టుగా కాకుండా అధికార పార్టీకి చెందిన స్థానిక శాసనసభ్యుల ఆదేశాలను పాటిస్తూ వారికి అటాచ్ అయిపోయి వారి ఆదేశాలను అమలు చేసే పోలీసులుగా రాష్ట్రంలో మారిపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
క్షేత్రస్థాయిలో పోలీసులు అధికార పార్టీ స్థానిక శాసనసభ్యుల ప్రైవేటు సైన్యంగా మారిపోవడంతో సమాజంలో అనేక వర్గాల ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కోల్పోయారన్నారు. క్షేత్రస్థాయి పోలీసులు అధికార పార్టీ శాసనసభ్యులు చెప్పినట్టుగా నడుచుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలు, కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల వాదులు, రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా భావజాలాన్ని వ్యాప్తి చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
పోలీసు వ్యవస్థను ప్రజల రక్షణ కోసం ఉపయోగించాలి తప్ప రాజకీయ పార్టీల కోసం కాదు అని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్యంలో ఆయా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి పోలీసు వ్యవస్థను ప్రజల కోసమే ఉపయోగించాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు రాసిన బహిరంగ లేఖ ద్వారా డిమాండ్ చేస్తున్నాను అని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.