Man dies after chinese manjha slits his throat: సంక్రాంతి పండగ పూట చైనా మాంజా (Chinese Manja) ఒకరి ప్రాణాలు బలితీసుకుంది. ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. టీవీఎస్ ఛాంప్‌పై భార్యతో కలిసి అతను ఆసుపత్రికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో అనూహ్య రీతిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాల (Mancherial) సమీపంలోని బ్రిడ్జిపై శనివారం (జనవరి 16) సాయంత్రం ఈ ఘటన జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... మంచిర్యాల జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన భీమయ్య అనే వ్యక్తికి శనివారం ఉదయం చేతి వేలికి గాయమైంది. దీంతో ఆసుపత్రిలో చూపించుకునేందుకు భీమయ్య, అతని భార్య కలిసి మంచిర్యాలకు వెళ్లారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని.. మెడికల్ షాపులో మందులు తీసుకుని ఇంటికి బయలుదేరారు.


టీవీఎస్ ఛాంప్‌ వాహనంపై భార్యాభర్తలు ఇంటికి తిరిగి వెళ్తుండగా.. పాత మంచిర్యాల సమీపంలోని బ్రిడ్జి వద్ద చైనా మాంజా దారం భీమయ్య మెడకు చుట్టుకుంది. దీంతో భీమయ్య బండిపై నియంత్రణ కోల్పోయాడు. వెనుక వైపు కూర్చొన్న భీమయ్య భార్యకు అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. ఇద్దరూ బండి నుంచి కింద పడిపోగా... భీమయ్య గొంతు నుంచి రక్తం దారలు కట్టింది. భీమయ్య భార్య అతని వద్దకు వెళ్లి లేపే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతను మృతి చెందాడు. చైనా మాంజా భీమయ్య గొంతును కోసేయడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.


సంఘటనా స్థలంలో భీమయ్య భార్య రోధించిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది. తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం అధికారులను వేడుకుంటోంది. అయితే ఆ చైనా మాంజా రోడ్డు పైకి ఎలా వచ్చిందన్నది తెలియలేదు. గాలి పటాలకు (Kite Festival) ఉపయోగించే చైనా మాంజాపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ... ఇప్పటికీ మార్కెట్‌లో అది లభ్యమవుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనమని చెప్పవచ్చు. ఒకరి గాలి పటాల సరదా మరొకరి ప్రాణాలు తీయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 


Also Read: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం... రూ.20 కోట్ల ఆస్తి నష్టం...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి