తెలంగాణలో హైఅలర్ట్ ప్రకటన ; నేతలూ జర జాగ్రత్త
విశాఖ ఏజెన్సీలో కాల్పుల ఘటనతో తెలంగాణ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ అధికారులతో డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అదనపు బలగాలు మోహరించాలని అన్ని జిల్లా ఎస్పీలను ఆదేశించారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని మంత్రులు, ప్రజా ప్రతినిధులతో సహా ఇతర నేతలకు పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. ఛత్తిస్‌గఢ్ సరిహద్దు బేస్ క్యాంపుల్లోని కేంద్ర బలగాలతో స్థానిక పోలీసులు సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.
పోలీసు భద్రతోనే ప్రచారం
ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ నేతలు తమ ప్రాంతాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న నేతలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. ప్రచారం కోసం మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు..పోలీసు భద్రతోనే మూరుమూల ప్రాంతాల్లో పర్యటించాలని.. మరి ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన నేతలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా డీఎస్పీ మహేందర్ రెడ్డిమ సూచించారు.