తెలంగాణ స్పీకరుకు పాలాభిషేకం
తెలంగాణ శాసనసభ స్పీకరు సిరికొండ మధుసూదనాచారికి అరుదైన గౌరవం లభించింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ తండాలను గ్రామ పంచాయితీలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ శాసనసభ స్పీకరు సిరికొండ మధుసూదనాచారికి అరుదైన గౌరవం లభించింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ తండాలను గ్రామ పంచాయితీలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. వరంగల్ రూరల్ శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, స్థానిక ప్రజలతో కలసి స్పీకరుకు పాలాభిషేకం చేశారు.
దాదాపు ఆ అభిషేకానికి ఆరు బిందెల పాలను ఉపయోగించారు. ఈ క్రమంలో స్పీకరు మధుసూదనాచారి తన అభిప్రాయాలను పంచుకున్నారు. భూపాలపల్లిలో 50 తండాలను గ్రామ పంచాయితీలుగా ప్రభుత్వం మార్చడానికి చొరవ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. గిరిజనులు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా తమ గ్రామాలను తామే అభివృద్ధి చేసుకోవాలని.. అందుకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని తెలిపారు.
వరంగల్ జిల్లా పరకాల మండలం నక్కలపల్లి గ్రామంలో జన్మించిన మధుసూదనాచారి 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1994-99 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికై తొలి సారిగా చట్టసభలో ప్రవేశించారు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి ప్రారంభించిన ఎన్టీఆర్ టీడీపీ పార్టీలో కూడా చేరారు. టీఆర్‌ఎస్ పార్టీ స్థాపనకు 8 నెలల ముందు నుండే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు.2014 సాధారణ ఎన్నికలలో వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి టిఆర్‌ఎస్ పార్టీ టికెట్‌పై ఎన్నికయ్యారు.