Minister Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టులో ఈఎన్సీ హరేరాం పాత్ర చాలా గొప్పది. అన్నీ సమయాల్లో, సందర్భాల్లో అండగా ఉన్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రంగనాయక జలాశయం నడి మధ్య సాగునీటి పండుగ జరగడం సంతోషంగా ఉందన్నారు. 2.5 టీఎంసీ నీళ్లు యాసంగి పంటల కోసం ఆ ప్రాంత రైతులకు విడుదల చేశామని చెప్పిన మంత్రి హరీశ్ రావు.. ఇవాళ తెలంగాణలో జరిగిన మార్పును చూడండి అని జనానికి సూచించారు. సీఎం కేసీఆర్ వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది అని సీఎం కేసీఆర్ ని కొనియాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన రోజు చాలా అనుమానాలు వచ్చేవి. పగలు, రాత్రుళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అందరం ఎంతో కష్టపడ్డాం అని గుర్తుచేసుకున్నారు. ఇంకెన్నో గొప్ప అనుభూతులు ఉన్నాయని, ఆనాడు మేం పడిన కష్టం గురించి ఏకంగా ఒక  పుస్తకమే రాయవచ్చు అని అభిప్రాయపడ్డారు. 


సీఎం కేసీఆర్ ఒక ఉద్యమ స్పూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం సిద్ధిపేట జిల్లాలో చేపట్టిన భూసేకరణలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి సాధించాం. స్వార్థం లేకుండా కష్టపడి పని చేశాం ఆనాటి కష్టాన్ని మంత్రి హరీశ్ రావు గుర్తుచేసుకున్నారు. 


దేశం మొత్తంలో నది లేకుండా ఒక ప్రాజెక్టు నిర్మాణం ఏదైనా జరిగిందా అంటే కేవలం మల్లన్న ప్రాజెక్టుకే ఆ ఘనత సొంతమైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూ సేకరణ కోసం ఎన్నో రాజీ లేని ప్రయత్నాలు చేశామని.. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పర్యావరణ అనుమతి కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఆఫీసుల చుట్టూ ఓపికగా తిరిగిన రోజులు చాలా ఉన్నాయని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఆనాడు తాము పడిన కష్టానికి ఫలితం దక్కిందని.. అప్పటి కష్టాల ఫలితమే నేటి గోదారి నీటి సవ్వడి అని చెబుతూ మంత్రి హరీశ్ రావు ఎంతో ఆనందం వ్యక్తంచేశారు.


ఒకప్పుడు కరువు పాటలు పాడుకున్న భూములు ఇవి. ఇదే బీడు వారిన నేలలో నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ సాగు నీరు పుష్కలంగా పారుతున్నది అని హర్షం వ్యక్తంచేశారు. అప్పట్లో.. సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి గుర్తుచేసుకున్న హరీశ్ రావు.. అప్పట్లో ఎండా కాలం వస్తే వ్యవసాయానికి నీళ్లు లేక రైతులు బోరు బావుల కోసం అప్పులు చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. ఇప్పుడు ఆ వ్యధ లేదని అభిప్రాయపడ్డారు.


తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప మార్పును సాధించింది. జలం జీవం. నీరు ప్రాణధారం. ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా... అందుకు నీరు ఎంతో అవసరం. నీరు లేని చోట మనిషి మనుగడ కొనసాగించడం కష్టం అవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక బోర్ మోటర్ మరమ్మత్తు లేదు... విద్యుత్ కోతలు లేకపోవడంతో బోరు మోటర్ కోసం జనరేటర్ తో అవసరం లేని పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. పాలమూరు జిల్లాలో ఒకప్పుడు కరువు తాండవం చేసేది.. అందుకే వలస జిల్లాగా పేరొచ్చింది... కానీ ఇప్పుడు పాలమూరు పచ్చని పైర్లు కప్పుకున్న జిల్లాగా పేరుగాంచింది అని తెలిపారు. ఇవన్నీ సీఎం కేసీఆర్ సాధించిన ఘనతలే అని మంత్రి హరీశ్ రావు గుర్తుచేసుకున్నారు.