Harish Rao Comments On Governor Tamilisai Soundararajan: నూతన సచివాలయం ప్రారంభానికి తనకు ఆహ్వానం రాలేదని గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌ రావు స్పందించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్వే ప్రారంభానికి కేసీఆర్‌కు ఆహ్వానం ఇచ్చారా..? అని ప్రశ్నించారు. గవర్నర్‌కు కొన్ని ప్రత్యేక విధులు ఉంటాయని.. ఆ విధులకు లోబడి మాత్రమే పని చేయాలని హితవు పలికారు. అసెంబ్లీ ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లులను ఏ ఉద్దేశంతో పక్కన పెడతారని ప్రశ్నించారు. జీ20 సమ్మిట్‌లో ప్రపంచ దేశాల ముందు రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు. దేశంలో ఓటమి ఎరుగని నేత కేసీఆర్ అని అన్నారు. తెలంగాణలో పోటీ చేయాలని గవర్నర్‌కు ఉంటే చేయొచ్చని అన్నారు. సిద్దిపేట నుంచి పోటీకి నిలడినా ఒకేనని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడారు మంత్రి హరీష్‌ రావు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'సచివాలయం ప్రారంభానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా..? పార్లమెంటు శంకుస్థాపనకు ప్రధాని రాష్ట్రపతిని పిలిచారా..? వందే భారత్ ట్రైన్ల ప్రారంభిస్తున్న ప్రధాని.. రాష్ట్రపతిని పిలుస్తున్నారా..? మహిళా గవర్నర్‌గా మాకు గౌరవం ఉంది.. కానీ ఆమె తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే పొడెం వీరయ్య వినతి పత్రం ఇచ్చారని గవర్నర్ భద్రాచలం విలీన గ్రామాల బిల్లును ఆపారు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా..? వైద్య శాఖలోప్రొఫెసర్ల  పదవీ విరమణ వయస్సు పెంచడానికి సంబంధించిన బిల్లును గవర్నర్ ఆపారు. ఆ బిల్లులో అభ్యంతర కరమైన అంశాలు ఏమి ఉన్నాయి..?


అనేక రాష్ట్రాల్లో 65 నుంచి 70 ఏండ్లకు పదవీ విరమణ పెంచారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 70 ఏళ్లకు పదవి విరమణ వయసును పెంచవచ్చని గైడ్ లైన్స్‌లోనే ఉంది. వేరే రాష్ట్రాల్లో లేని అభ్యంతరం ఇక్కడ గవర్నర్‌కు ఎందుకు..? ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలు రాష్ట్రం జాబితాలో మరి కొన్ని అంశాలు ఉంటాయి. వాటి కనుగుణంగా బిల్లులు ఉన్నాయా లేదా అని చూడటం వరకే గవర్నర్ బాధ్యత. సుప్రీం కోర్టులో ఏమైనా కేసులు ఉంటే గవర్నర్ బిల్లులు ఆపొచ్చు. ఈ బిల్లుల్లో అలాంటివి ఏమైనా ఉన్నాయా..? పదవీ విరమణ వయస్సు బిల్లును ఏడు నెలలు ఆపడంతో ప్రజలకు నష్టం కలుగుతోంది. బెంగాల్లో 70 యేండ్లు ఉన్నపుడు ఇక్కడ 65 కు కూడా గవర్నర్ ఒప్పుకోరా..? డాక్టర్ అయి ఉండి తమిళ్ సై ప్రజలకు వైద్య సదుపాయాలు అందకుండా చేయడం న్యాయమా..?' అంటూ మంత్రి హరీష్‌ రావు ప్రశ్నల వర్షం కురిపించారు. 


సుప్రీం కోర్టు లో కేసు వేసే దాకా గవర్నర్ స్పందించలేదని. చివరకు తిరస్కరించి రాష్ట్రపతికి పంపారని అన్నారు. తన ప్రభుత్వం అంటూనే గవర్నర్ వెన్ను పోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. పిల్లలకు విద్య, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను గవర్నర్ దూరం చేస్తున్నారని పేర్కొన్నారు. బీహార్, ఝార్ఖండ్, ఒడిశాల్లో ఎన్నో ఏళ్ల నుంచి యూనివర్సిటీ కామన్ రిక్రూట్‌మెంట్ నడుస్తోందని.. ఇక్కడ గవర్నర్‌కు దీనిపై ఎందుకు అభ్యంతరం..? అని ప్రశ్నించారు. నోటితో నవ్వుతూ నొసలితో గవర్నర్ వెక్కిరిస్తున్నారని అన్నారు. 


'గతంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్.. ఇపుడు అలాంటి బిల్లునే అడ్డుకుంటున్నారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అవి బీజేపీ పాలిత రాష్ట్రాలే కదా..? సిద్దిపేటలో వెటర్నరీ కాలేజీ మంజూరు అయింది. దానికి ప్రొఫెసర్ల కొరత ఉంది. గవర్నర్ ఆ బిల్లును అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడం కాదా..? జీ20కి సంబంధించిన సమావేశాల్లో గవర్నర్ తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా మాట్లాడారు. కేసీఆర్ గురించి ఆమె మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉన్నాయి..    ' అని మంత్రి అన్నారు. 


Also Read: Delhi BRS Party Office: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే..!  


Also Read: Virat Kohli Vs Gautam Gambhir: విరాట్ కోహ్లీ, గంభీర్ ఫైట్.. జరిమానా ఎవరు చెల్లిస్తారంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook