మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం విడుదలై బ్లాక్ బ‌స్టర్ హిట్ సాధించింది. అన్ని వ‌ర్గాల నుంచి ఈ మూవీకి ప్రశంస‌లు ల‌భించాయి. తాజాగా ఈ మూవీని తెలంగాణ మంత్రి కేటీఆర్ వీక్షించారు. ప్రతి రాజకీయ నాయకుడు చూడాల్సిందేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మహేష్, కొరటాలతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా 'భరత్ అనే నేను' చిత్రాన్ని చూశారు. ఆయ‌న కోసం చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఒక షో వేశారు. థియేట‌ర్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు మ‌హేష్, ద‌ర్శకుడు కొర‌టాల శివ‌లు బొకే ఇచ్చి స్వాగ‌తం ప‌లికారు. త‌ర్వాత కేటీఆర్‌తో క‌ల‌సి వారంతా ఈ మూవీని వీక్షించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా చూసిన ఆయన రాజ‌కీయ నేప‌థ్యంతో ఒక మంచి చిత్రాన్ని తీసారంటూ నిర్మాతల్ని, చిత్రయూనిట్‌ని అభినందించారు.  ముఖ్యమంత్రిగా మ‌హేష్ బాగా న‌టించార‌ని, ద‌ర్శక‌త్వ విలువలు ఉన్న మూవీ అని ప్రశంసించారు. అటు తమ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసినందుకు, అభినందించినందుకు కేటీఆర్‌కు హీరో మహేష్, దర్శకుడు కొరటాల శివ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.



 



 


తమ విలువైన సమయాన్ని కేటాయించి, 'భరత్ అనే నేను' సినిమాను చూసినందుకు, తమ ప్రయత్నాలను ప్రశంసించినందుకు ప్రత్యేక థ్యాంక్స్ అంటూ మహేష్ ట్వీట్ చేశారు. తమ సినిమా సక్సెస్ కు సంబంధించిన సెలబ్రేషన్స్‌కు మీరు హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందని, కేటీఆర్ ఈ షో చూడ‌టం త‌మ‌కు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని అన్నారు.