Asia Berlin Summit 2023: తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జర్మనీలోని బెర్లిన్ లో జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్ - 2023 సదస్సుకి హాజరు కావాల్సిందిగా మంత్రి కేటీఆర్ కి నిర్వాహకులు ఆహ్వానం పలికారు. ఈ సమావేశం జూన్ 12 నుంచి 15 వరకు జర్మనీలోని బెర్లిన్ లో జరగనుంది. కనెక్టింగ్ స్టార్టప్ ఈకో సిస్టం అనే అంశంపైన ఈ సమావేశం జరుగుతుంది అని.. ఈ సదస్సుకు హాజరై, ప్రసంగించాలి అని కోరుతూ నిర్వాహకులు మంత్రి కేటీఆర్ కి ఈ ఆహ్వానం అందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జర్మనీ సెనెట్ కి చెందిన ఎకనామిక్స్, ఎనర్జీ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి నుంచి మంత్రి కేటీఆర్ కి ఈ ఆహ్వానం అందింది. ఈ సదస్సులో ప్రసంగించడం ద్వారా భారత్ తో పాటు తెలంగాణ ఇతర దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ప్రయత్నాలను బలోపేతం చేయాలని కోరింది. ప్రతి ఏటా ఈ సదస్సు ద్వారా జర్మనీ, అసియా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను, భాగస్వామ్యాలను బలోపేతం చేసేందుకు నిర్వహిస్తారు. ముఖ్యంగా జర్మనీలో ఉన్న స్టార్టప్ సంస్థలను అసియా ఖండంలోని మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది అని నిర్వాహకులు తెలిపారు. 


ఈ సంవత్సరం జరగనున్న సదస్సు మొబిలిటీ, లాజిస్టిక్స్, ఎనర్జీ, గ్రీన్‌టెక్, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రధానమైన అంశాలను విస్తృతంగా చర్చిస్తుందని తెలిపారు. దీంతోపాటు ఈ సమావేశంలో భాగంగా పెట్టుబడిదారులకు ప్రత్యేకమైన సెషన్ ఉంటుందని, అద్భుతమైన ఐడియాలున్న స్టార్టప్ కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. జర్మనీలో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం బలాన్ని అసియా ఖండంలోని స్టార్టప్ సంస్థలతో పంచుకునేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు మంత్రి కేటీఆర్ కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు. దీంతో భారత్ లో ఉన్న అవకాశాలను.. మరీ తెలంగాణలో ఉన్న అవకాశాలను ఆ వేదికపై పంచుకునే యోచనలో మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.