Minister KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు
KTR legal notices to Revanth Reddy and Bandi Sanjay: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో ఈ ఇద్దరు నేతలు మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతున్నారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.
KTR Legal Notices to Revanth Reddy and Bandi Sanjay: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నందుకు వీరిద్దరికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు చెప్పారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.
స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ఏర్పాటయిందన్నారు మంత్రి కేటీఆర్. అయితే ఈ వాస్తవాలు అన్నిటినీ పక్కనపెట్టి ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు బండి సంజయ్, రేవంత్‌లు తెరలేపారని అన్నారు. ప్రభుత్వాల పరిపాలన వ్యవహారాల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తెలివి తక్కువతనంతో వీరు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ వ్యవహారంలో కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతోనే పదేపదే తన పేరును లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్ట కాల్చి మీదేసే ఇలాంటి చిల్లర ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లో సహించనని హెచ్చరించారు.
ఇప్పటికే వీరు తమ తెలివి తక్కువ ప్రకటనలు, మతిలేని మాటలతో ప్రజల్లో చులకన అయ్యారని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో కోవిడ్ సందర్భంగా పదివేల కోట్ల వ్యాక్సీన్ కుంభకోణం జరిగిందని, వేల కోట్ల విలువచేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారనే తిక్క వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారని అన్నారు. తెలివి తక్కువతనంలో రేవంత్‌తో పోటీపడి శవాలు-శివాలు, బండి పోతే బండి ఫ్రీ అంటూ బండి సంజయ్ చేసిన అర్థరహిత వ్యాఖ్యలు కూడా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వీరి వ్యాఖ్యలు, వ్యవహారశైలిని గమనించిన తరువాత, వీరిద్దరు మానసిక సంతులనం కోల్పోయారని ప్రజలు భావిస్తున్నారన్నారు. వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు.
'టీఎస్పీఎస్సీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ర్పచారాల వెనక మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే ఒక భయంకరమైన కుతంత్రం దాగి ఉంది. గతంలో ఇదే నాయకులు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమే ఒక కుట్రగా అభివర్ణించారు. చదువులు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు, వాళ్ల కుటిల మనస్థత్వానికి అద్దం పడుతున్నాయి. సంబంధం లేని మరణాలను కూడా ఈ వ్యవహారంతో అంటగట్టి.. యువత ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా చేసిన వికృత ప్రయత్నాలు విఫలమైనా కూడా వీరికి బుద్ధిరాలేదు. శవాలపైనే చిల్లర ఏరుకునే రాజకీయ రాబందుల మాదిరిగా కాంగ్రెస్, బీజేపీ మారారు..' అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
తలా తోక లేకుండా మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నేతల పిచ్చిమాటల ఉచ్చులో పడకుండా యువత తమ పోటీ పరీక్షల సన్నద్ధతపైనే దృష్టి సారించాలనిరాష్ట్ర యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు. టీఎస్పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందని భవిష్యత్తులో నిర్వహించబోయే పరీక్షలను మరింత కట్టుదిట్టంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు సన్నద్ధమవుతుందన్నారు. కేవలం రాజకీయాల కోసం జరుగుతున్న దుర్మార్గపూరిత కుట్రలను, ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. ఎంపీ సభ్యత్వం రద్దు..?
Also Read: Ind Vs Aus: నీ యవ్వ తగ్గేదేలే.. డేవిడ్ వార్నర్ పుష్ప స్టైల్‌లో సంబురాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి