Minister Malla Reddy comments on Revanth Reddy: హైదరాబాద్: మంత్రి మల్లా రెడ్డి మరోసారి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి 50 కోట్లు పెట్టి పీసీసీ చీఫ్ పోస్ట్ కొన్నాడని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందని.. అటువంటి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీని విమర్శించే హక్కు లేదని అన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని... అలాంటి ముఖ్యమంత్రి జోలికి కానీ లేదా ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి కేటీఆర్ (Minister KTR) జోలికి కానీ ఎవరైనా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి మల్లా రెడ్డి.. గతంలో తరహాలోనే మరోసారి రేవంత్‌పై నోరుపారేసుకున్నారు. ఇటీవల జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో మంత్రి మల్లా రెడ్డి (Minister Malla Reddy) ఈ వ్యాఖ్యలు చేశారు. 


ఇదిలావుంటే, గతంలోనే రేవంత్ రెడ్డిని తన ఎంపీ పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాల్సిందిగా మంత్రి మల్లా రెడ్డి సవాల్ (Minister Malla Reddy vs Revanth Reddy) విసిరిన సంగతి తెలిసిందే. మంత్రి మల్లా రెడ్డి భూకబ్జాలు చేస్తున్నారని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, కబ్జా చేసిన స్థలంలోనే మెడికల్ కాలేజీ నిర్మించారని గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంత్రి మల్లారెడ్డికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. అప్పటి నుంచి రాజకీయంగా ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి.