తెలంగాణ యాదగిరిగుట్ట కేంద్రంగా ఓ బ్రోతల్ నడుపుతున్న కుటుంబ సభ్యులు కనీవినీ ఎరుగని దారుణానికి ఒడిగట్టారు. పేద బాలికలను చేరదీస్తూ చదువు చెప్పిస్తామన్న నెపంతో వారి చేత వ్యభిచారం చేయించడానికి సంకల్పించారు. అయితే రాచకొండ పోలీసుల చాకచక్యంతో ఈ ముఠా గట్టు రట్టయింది. వివరాల్లోకి వెళితే కంసాని యాదగిరి గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట ప్రాంతంలో నివసిస్తున్నాడు. బయట చూడడానికి సంసారుల ఇల్లులా కనిపించినా.. ఆ ఇంట్లో జరుగుతున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అభం శుభం ఎరుగని బాలికలను బ్రోకర్ల ద్వారా అక్కడికి తరలించడం అక్కడ నిత్యం జరిగే పని.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పదేళ్లు కూడా నిండని వయసులో అక్కడికి వచ్చే బాలికలకు హార్మోన్స్ ఎదుగుదల కోసం ఇంజక్షన్స్ ఇచ్చి.. ఆ తర్వాత వారిని వ్యభిచారంలోకి దింపడం అక్కడ రెగ్యులర్‌గా జరిగే పద్ధతి. తమ వద్దకు వచ్చి బాలికల పై చుట్టుప్రక్కల ఇండ్ల వారికి అనుమానం రాకుండా ఉండేందుకు కూడా ఈ ముఠా ఓ ప్రణాళిక రచించింది. తమ వద్దకు వచ్చే చిన్నారులను తొలుత స్థానిక పాఠశాలల్లో చేర్చి.. ఆ తర్వాత స్కూలు రికార్డ్స్‌లో వారు పేరు చేరాక.. అదే బాలికల పేరుతో ఆధార్ కార్డుకి దరఖాస్తు చేసేవారు. ఆ ఆధార్ కార్డు దరఖాస్తులో బ్రోతల్ యాజమానులే ఆ చిన్నారుల తల్లిదండ్రులుగా తమను పేర్కొంటూ వివరాలు ఇచ్చేవారు.


ఒక సారి ఆధార్ కార్డు వచ్చాక.. వీరి పని ఇంకా సులువయ్యేది. పోలీసులకు ఫిర్యాదు మేరకు అక్కడికి వచ్చి వాకబు చేసినా.. ఆ బాలికలు తమ పిల్లలే అని నమ్మబలికేవారు. ఈ ముఠాను స్వామి అనే ఓ డాక్టరు ముందుండి నడిపిస్తున్నట్లు కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఆ డాక్టరే పిల్లలకు హార్మోన్ ఇంజక్షన్స్ ఇవ్వడానికి వచ్చేవాడని కూడా దర్యాప్తులో తేలింది. ఈ మధ్యకాలంలో ఈ కుటుంబం మీద అనుమానాలు ఉన్నాయని తరచూ స్థానికుల నుండి ఫిర్యాదులు రావడంతో షీ టీమ్‌ సహకారంతో రాచకొండ పోలీసులు కొన్నాళ్లు రహస్యంగా ఈ కుటుంబం మీద నిఘా పెట్టారు.


వారి కదలికలను గమనిస్తూ.. వారి వివరాలు మొత్తం సేకరించారు. ఆ దర్యాప్తులో పిల్లల పేరిట దొంగ ఆధార్ కార్డులున్నాయని తెలిసింది. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠాని గతంలో కూడా పలు ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు తేలింది. తాజాగా ఒక ప్రణాళిక ప్రకారం ఈ ముఠాని అరెస్టు చేసిన పోలీసులు.. వారిపై ఐపీసీ 366 ఏ, 371, 376, 372, 120 బి, 17, 133 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు.