రైల్వే అప్డేట్: ఆ ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు, పలు ప్యాసింజర్ రైళ్ల షెడ్యూల్ మార్పు
సిగ్నల్ వ్యవస్థ అప్గ్రేడేషన్ పనుల కారణంగా పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
హైదరాబాద్ రైల్వేస్టేషన్‌లో సిగ్నల్ వ్యవస్థ అప్‌గ్రేడ్ చేస్తున్నందున హైదరాబాద్ - లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గాల్లో నడిచే పలు ఎంఎంటీఎస్ రైలు సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. మొదటిగా శనివారం నాడు హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 10 సర్వీసులను రద్దు చేయగా, ఆ తర్వాత ఆదివారం నాడు లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య నడిచే 47171 నంబరు గల ఎంఎంటీఎస్ రైలుతోపాటు హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడిచే 47100, 47101 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దుచేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.
హైదరాబాద్-కొచువెల్లి మధ్య నడిచే స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 9.40 గంటలకు బయల్దేరనుండగా హైదరాబాద్-పూర్ణ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు శనివారం రాత్రి 10.17 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరుతుందని అధికారులు తెలిపారు. అలాగే పర్బానీ- హైదరాబాద్ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 11.10 గంటలకు బయల్దేరనున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.