Mother And Daughter: ఖమ్మం జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు పోలీస్ ఈవెంట్స్‌లో తమ సత్తా చాటారు. సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం జరిగిన పోలీసు ఈవెంట్స్‌లో ఇద్దరూ ఒకేసారి పాల్గొని అర్హత‌ సాధించడం విశేషం. పేదింటిలో పుట్టి, పెరిగిన ఈ ఇద్దరు మహిళలు సబ్ ఇన్‌స్పెక్టర్ అవడానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు. నేలకొండపల్లి మండలంలో చెన్నారం గ్రామానికి చెందిన నాగమణి, ఆమె కూతురు త్రిలోకిని ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల్లో పాసయ్యారు. తాజాగా ఈవెంట్స్‌కి హాజరై, ఈవెంట్స్‌లో కూడా పాసయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తల్లి నాగమణి అంగన్‌వాడీ టీచర్ నుండి పోలీస్ డిపార్ట్మెంట్‌కు వచ్చారు. మొదటగా హోంగార్డుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. తన తల్లి పోలీస్ డ్రెస్ చూసి తను కూడా పోలీస్ కావాలని నాగమణి కూతురు త్రిలోకి ఆశపడింది. అందుకు అనుగుణంగానే తల్లితో కలిసి ఎస్ఐ కావడానికి కోచింగ్ తీసుకుంది. తాజాగా జరిగిన ఈవెంట్స్‌లో ఇద్దరు తమ‌సత్తా చాటి ఈవెంట్స్‌లోనూ ఉత్తీర్ణత సాధించారు. ఇక త్వరలో జరగబోయే ఎస్ఐ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. 


చిన్నప్పటి నుండి పేదరికంలో ఉన్న కారణంగానే కుటుంబానికి తన వంతుగా అండగా నిలబడాలని తాను ఉద్యోగం చేస్తూ వస్తున్నట్లు నాగమణి మీడియాకు తెలిపారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలనే సంకల్పంతోనే తాను ఎస్సై పరీక్ష కోసం సన్నద్ధం అవుతూ తన కూతురిని కూడా ఎస్ఐ పరీక్ష కోసం ప్రిపేర్ చేయించినట్టు నాగమని పేర్కొన్నారు. ఎస్ఐ కావాలనే లక్ష్యంతో తాను కష్టపడుతున్నట్లు నాగమని పేర్కొన్నారు. తమ లక్ష్యం అడుగు దూరంలో ఉండడం ఎంతో ఆనందంగా ఉందని తల్లి కూతురు ఆనందం వ్యక్తంచేశారు. ఇక మెయిన్స్‌లో కూడా పాసైతే ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ ఎస్సై ఉద్యోగాలు సాధించనున్నారు. తల్లిబిడ్డలు ఎస్ఐ ఈవెంట్స్‌కు అర్హత‌ సాధించడంతో ఆ గ్రామంలో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. తమ గ్రామం గర్వపడేలా చేశారని గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు.