Munugode Bypoll: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ కు షాక్ తగిలింది. ఆ డ్యామేజీని పూడ్చుకోవాలంటే మునుగోడులో ఖచ్చితంగా గెలిచి తీరాలన్నది కేసీఆర్ లక్ష్యం. అందుకే కోమటిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే మునుగోడుపై ఫోకస్ చేశారు. రెండు వారాల్లోనే బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డికి మునుగోడు బైపోల్ బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలను నియోజకవర్గంలో మోహరించారు. మంత్రి జగదీశ్ రెడ్డి  డైరెక్షన్ లో సీఎం కేసీఆర్ సభ కోసం జన సమీకరణ చేస్తున్నారు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి మునుగోడు నియోజకవర్గ అధికార పార్టీలో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉంది. ఏకంగా ఆరుగురు టికెట్ రేసులో నిలిచారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ టికెట్ ఆశించారు. ఎవరికి వారు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. కూసుకుంట్లకు వ్యతిరేకంగా సమావేశం పెట్టిన దాదాపు ౩ వందల మంది అసమ్మతి నేతలు.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని ఏకంగా  తీర్మానం  చేశారు. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు జై కొట్టారని తెలుస్తోంది. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే అంతా తాను చూసుకుంటానని సీఎంకు చెప్పినట్లు.. కేసీఆర్ కూడా కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది. మునుగోడు సభలో కూసుకుంట్ల పేరును అధికారికంగా కేసీఆర్ ప్రకటిస్తారని అంటున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలోనే మునుగోడు సభ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.


అయితే ఇక్కడే మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. గత వారం రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతున్న జగదీశ్ రెడ్డి..  సీనియర్ నేతలను పట్టించుకోకుండా  ఏకచక్రాధిపత్యం వహిస్తున్నారనే టాక్ గులాబీ కేడర్ నుంచి వస్తోంది. అంతా తానే చూసుకుంటానని.. ఎవరూ అవసరం లేదనే ఆహంకారపూరితంగా మంత్రి తీరు ఉందని అంటున్నారు. సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లు, జన సమీకరణ  విషయంలో సీనియర్ నేతలైన బూర, కర్నెను మంత్రి కనీసం పరిగణలోనికి తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గతంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం భాగంగా ఉన్న భువనగిరి ఎంపీగా పని చేశారు బూర నర్సయ్య గౌడ్. ఇక పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కర్నె ప్రభాకర్ ప్రభుత్వ విప్ గా పని చేశారు. గతంలో సీఎం కేసీఆర్ నిర్వహించిన  వందలాది బహిరంగ సభల ఏర్పాట్లను ఆయనే పర్యవేక్షించారు. అంతటి సీనియర్ నేతలతో సంబంధం లేకుండా మంత్రి జగదీశ్ రెడ్డి వ్యవహరిస్తుండటంపై టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ నేతలను పట్టించుకోకపోతే తాము సభకు ఎలా వెళ్తామంటూ కొందరు నేతలు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు.  


మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లింది.  టికెట్ రేసులో ఉన్న నల్గొండ ఎమ్మెల్యే సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిని ప్రగతి భవన్ పిలుపించుకుని మాట్లాడారు సీఎం కేసీఆర్. కాని సీనియర్ నేతలైన కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య గౌడ్ కు మాత్రం ఎలాంటి పిలుపు లేదు. ఇందుకు మంత్రి జగదీశ్ రెడ్డే కారణమనే ప్రచారం సాగుతోంది. అంతా సెట్ అయిందని, అసమ్మతి లేదని మంత్రి చెప్పడం వల్లే కేసీఆర్ నుంచి పిలుపు రాలేదనే చర్చ సాగుతోంది. కేసీఆర్ తో ఒకలా చెబుతూ.. నియోజకవర్గంలో మాత్రం మంత్రి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో జోరుగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిన మంత్రి జగదీశ్ రెడ్డి. అయితే చేరికల సమయంలోనూ ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపే కర్నె ప్రభాకర్, బూన నర్సయ్య గౌడ్ ను కావాలనే మంత్రి అవమానించేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.  మంత్రి తీరు వల్లే చౌటుప్పల్ ఎంపీపీ బీజేపీలో చేరారని.. మరికొందరు కూడా అదేదారిలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.


ఈనెల 20న మునుగోడులో కేసీఆర్ సభ ఉంది. ముఖ్యమంత్రి బహిరంగసభకు సమయం దగ్గరపడుతున్నా సీనియర్ నేతలకు ఇప్పటివరకు ఎలాంటి పిలుపు రాకపోవడంతో గులాబీ కేడర్ లో ఆందోళన కనిపిస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కర్నె, బూర అనుచరులు. మరోవైపు  సీనియర్ నేతలను పట్టించుకోని మంత్రి.. వాళ్ల అనుచరులపై మాత్రం ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. తన మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొందరు స్థానిక ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారని తెలుస్తోంది. దీంతో నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో మునుగోడు టీఆర్ఎస్ లో అయోమయ పరస్థితులు ఉన్నాయని అంటున్నారు. సీఎం కేసీఆర్ సభకు సీనియర్ నేతలు వస్తారా లేదా.. రాకపోతే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది.  


Read Also: MLA Warning: కాళ్లు విరగ్గొట్టండి.. నేను చూసుకుంటా! కార్యకర్తలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే.. 


Read Also: TSRTC: తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్... హైదరాబాద్ సిటీ బస్సుల్లో 2 గంటల ఉచిత ప్రయాణం.. ఎవరికి వర్తిస్తుందంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook