Munugode Posters: ఫోన్ పే తరహాలో కాంట్రాక్ట్ పే.. మునుగోడులో పోస్టర్ల కలకలం
Munugode Posters: చండూరులో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.బీజేపీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే కోమటిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ వేసిన రోజే అతనికి వ్యతిరేకంగా చండూరులో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి
Munugode Posters: మునుగోడు ఉప సమరంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రధాన పార్టీలు.. తమ బలం పెంచుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలను వీక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. సోషల్ మీడియా ఇందుకు వేదికవుతోంది. సోషల్ మీడియాతో పాటు ఇతరత్రా మార్గాలను అనుసరిస్తున్నాయి పార్టీలు. ఈ నేపథ్యంలోనే చండూరులో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. బీజేపీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చండూరులో భారీ ర్యాలీ తీశారు. బీజేపీ అగ్రనేతలంతా హాజరయ్యారు. అయితే కోమటిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ వేసిన రోజే అతనికి వ్యతిరేకంగా చండూరులో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి.
బీజేపీ ఇచ్చిన 18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారన ఆరోపణలు వస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలతో చండూరులో రాత్రితి రాత్రే పోస్టర్లు దర్శనమిచ్చాయి. కర్ణాటకలో అక్కడి ముఖ్యమంత్రి బొమ్మైకు వ్యతిరేకంగా జరిగిన ఫోన్ పే పోస్టర్ల తరహాలోనే చండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ కోమటిరెడ్డికి కేటాయించారు.. ట్రాన్సక్షన్ ఐడి పేరుతో బీజేపీ 18వేలకోట్లు అంటూ పోస్టర్లలో రాశారు. రూ.500కోట్ల బోనస్ అని రివార్డ్ గా చూపించారు. Phone Pay తరహాలో Contract Pe, 18000 కోట్లు Transaction కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కు కేటాయించడం జరిగిందని వందల సంఖ్యలో గోడలకు రాత్రికి రాత్రి అంటించారు.
అయితే రాజగోపాల్ రెడ్డకి వ్యతిరేకంగా ఈ పోస్టర్లు ఎవరు అతికించారన్నది మాత్రం తెలియడం లేదు. కొంతకాలంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయాడని విమర్శలు చేస్తున్నారు. మునుగోడులో జరిగిన అమిత్ షా సభ సమయంలోనూ రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఇలాంటి పోస్టర్లు దర్శనమిచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదలను చూపిస్తూ రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేశారు. తాజాగా చండూరులో వెలిసిన పోస్టర్లపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్ల వ్యవహారం చండూరులో ఉద్రిక్తతకు దారి తీసింది.
మునుగోడు ప్రచారంలో ఫోన్ పే లోగో వాడటంపై ఆ సంస్థ స్పందించింది. తమ లోగోను వాడటం మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఆ మేరకు PhonePe ఓ ప్రకటన విడుదల చేసింది. "‘Contract Pe’పై కొన్ని ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలతో PhonePeకు ఎలాంటి సంబంధం లేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. మా కంపెనీకి ఏ పార్టీతో కానీ, అభ్యర్థితో కానీ ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవు. ‘Contract Pe’ను రూపొందించడంలో PhonePe యొక్క లోగోను ఉపయోగించడం అనేది తప్పుదారి పట్టించేది మాత్రమే కాక, PhonePe యొక్క మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించడం కూడా కాగలదు. దీనికి సంబంధించి భవిష్యత్తులో తగిన చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు PhonePe కలిగి ఉంది."
Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో వాన జోరు.. మరో నాలుగు రోజులుపాటు ఇలాగే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook