నాగోబా జాతర విశేషాలు ఇవే..!
ఆదిలాబాద్ జిల్లాలో ప్రతీ సంవత్సరం, సంక్రాంతి సమయంలోనే నాగోబా జాతర పేరుతో అతి పెద్ద గిరిజన ఉత్సవం జరుగుతుంది.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రతీ సంవత్సరం, సంక్రాంతి సమయంలోనే నాగోబా జాతర పేరుతో అతి పెద్ద గిరిజన ఉత్సవం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో జరిగే ఈ జాతరకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో భక్తులు విచ్చేస్తుంటారు. అలాగే పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేస్తుంటారు. మరి ఈ జాతర గురించి మనం కూడా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం
ఈ జాతర పుష్య అమావస్య రోజున మొదలవుతుంది. గోండులు, మెస్రం వంశీయులు, ఆదివాసీలు, బోయగొట్టేలు ఈ జాతరలో అత్యధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఈ జాతరకు సంబంధించి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. మెస్రం వంశానికి చెందిన ఏడుగురు సోదరులు చిన్నప్పుడే మేనమామ ఇంటి నుండి పారిపోయి, వేరే దేశానికి వెళ్లి బాగా డబ్బు సంపాదించి తిరిగొస్తారు. అయితే తన తండ్రిని చంపాలని వారు వచ్చారని భావించిన వారి మేనమామ కూతురు ఇంద్రాదేవి తనదగ్గరున్న శక్తులను వారి మీద ప్రయోగిస్తుంది. పులి రూపంలో వచ్చి వారిని సంహరిస్తుంది. అయితే ఆ సోదరుల్లో చివరివాడు నాగేంద్రుడి భక్తుడు కావడం వల్ల ఆమెను ఎదరించగలుగుతాడు. తర్వాత ప్రాణాలతో బయటపడి సొంతవూరికి చేరుకుంటాడు. అప్పుడే తనకు తన ప్రాణాలు కాపాడిన నాగేంద్రుడికి గుడి కట్టాలనే ఆలోచన కలుగుతుంది. అలా ఆయన ప్రతిష్టించిన నాగాలయ ప్రాంగణంలో నాగోబా ఉత్సవాలు ప్రతీ సంవత్సరం జరుపుతుంటారని అంటారు.
అదే విధంగా ఈ జాతరకు సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. మెస్రం కుటుంబానికి చెందిన మోతిరాణి అనే అమ్మాయికి నాగదేవత కలలోకి వచ్చి మగశిశువుగా జన్మిస్తానని చెబుతుందట. అలా పుట్టిన శిశువు పెరిగి పెద్దయ్యాక, తన సోదరుడి కూతురైన గౌరికి ఇచ్చి పెళ్లి చేస్తుంది. అయితే తను నాగదేవత అంశ అని తెలుసుకున్న గౌరి భర్తే నాగోబాగా కేస్లాపూర్ గ్రామంలో నాగోబాగా వెలిసి పూజలందుకుంటున్నాడని మరో కథనం ప్రచారంలో ఉంది
నాగోబా ఉత్సవంలో భాగంగా మెస్రం వంశీయులు ఉట్నూరు మండలం శ్యాంపూర్‌లోని బుడుందేవ్ జాతరకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. దాదాపు 22 గిరిజన తెగలు ఈ జాతరలో పాల్గొనడం విశేషం. ఈ జాతరను దాదాపు 12 రోజులపాటు నిర్వహిస్తారు. భోనగిరికి చెందిన డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ బాలాజీ దూసరి 'నాగోబా జాతర'పై ఓ డాక్యుమెంటరీని కూడా తెరకెక్కిస్తున్నారు.