ఒకే రైల్వే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తే, ఆ దృశ్యం ఎంత భయానకంగా వుంటుంది ? ఆ ప్రమాదం దృశ్యాన్ని చూసేవాళ్లకు గుండెలు ఆగిపోయినంత పని అవుతుంది. చూసేవాళ్ల పరిస్థితే అలా వుంటే, ఆ రెండు రైళ్లలో ప్రయాణించే వారి పరిస్థితి ఇంకెంత ప్రమాదకరంగా వుంటుందో ఊహించుకోండి!! అవును, ఇది జరిగింది ఇంకెక్కడో కాదు.. సౌత్ సెంట్రల్ జోన్ అయిన సికింద్రాబాద్‌కి కూతవేటుదూరంలోనే వున్న కాచిగూడ రైల్వే స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌పై రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఎదురెదురుగా రావడంతో ప్రయాణికులు భయాందోళనతో ఊపిరి బిగపట్టుకుని ఏం జరగబోతుందా అని చూస్తుండిపోయారు. అయితే రెండు రైళ్లు ఒకదానికొకటి అత్యంత సమీపంలోకొచ్చి కొద్ది దూరంలో ఆగిపోవడంతో ప్రయాణికులు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. 


లోకో పైలట్లు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా.. ఊహకు అందని విషాదం చోటుచేసుకోవడం ఖాయం. అది ఎంఎంటీఎస్ రైలు కనుక సరిపోయింది కానీ కాచీగూడ స్టేషన్‌లో ఆగకుండా అత్యంత వేగంతో వెళ్లే రైలు అయితే, అప్పుడు పరిస్థితి ఏంటనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
 
కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్ వ్యవస్థలో వున్న లోపాల కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. సిగ్నల్ వ్యవస్థ లోపంతో ఎంఎంటీఎస్ రైళ్లను గంటల తరబడి స్టేషన్ బయటే ఆపివేస్తుంటారని, ఫలితంగా నగరం నుంచి బెంగళూరు, చెన్నై లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తమ రైళ్లను మిస్ అవుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తోన్నారు.