ఇంటర్ ఫలితాల వివాదంలో తెలంగాణ సర్కార్‌కి ఎన్హెచ్ఆర్సి నోటీసులు
ఇంటర్ ఫలితాల వివాదంలో తెలంగాణ సర్కార్‌కి ఎన్హెచ్ఆర్సి నోటీసులు
హైదరాబాద్: ఇంటర్ బోర్డు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. ఇంటర్ ఫలితాల వెల్లడి అనంతరం మానసిక ఆందోళనకు గురైన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్టుగా ప్రసారమైన మీడియా కథనాలను సుమోటాగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. తెలంగాణ సర్కార్‌కి నోటీసులు జారీచేసింది. 3 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవడం ఆందోళనకు గురిచేసిందని జాతీయ మానవ హక్కుల సంఘం ఆవేదన వ్యక్తంచేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని సరైన పరిష్కారమార్గాన్ని కనుగొనాల్సిందిగా సూచించడంతోపాటు ఈ వివాదంపై నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థిని విద్యార్థుల వరుస ఆత్మహత్యల వివాదంపై జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవడంతో ఇకనైనా తమకు ఏమైనా న్యాయం జరుగుతుందేమోనని బాధితులు, వారి తల్లిదండ్రులు వేచిచూస్తున్నారు.