KTR Fire On Revanth Reddy: అధికారంలోకి వచ్చాక తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై జరుగుతున్న డాడులను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీ రామారావు ఖండించారు. పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరికొద్ది రోజులు భరిస్తాం.. తర్వతా వాళ్లు ఇటుకలతో కొడితే తాము రాళ్లతోనే కొడతామని చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా రాకపోతుండే అని తెలిపారు. రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరూ అనుకోలేదని పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Cyber Crime: శ్రీరెడ్డి, పంచ్‌ వంటివారిపై వైఎస్‌ షర్మిల ఫిర్యాదు.. తప్పుడు ఆరోపణలంటూ ఆగ్రహం


నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న దాడులు, తిరోగమన పనులపై మండిపడ్డారు. 'రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడడం లేదు. లంకె బిందెల దొంగ లెక్క మాట్లాడుతున్నాడు. లంకె బిందెల కోసం దొంగలు అర్ధరాత్రి తిరుగుతారు కానీ సచివాలయంలో రాజకీయ నాయకులు తిరగరు. లంకె బిందెలు వెతికే రేవంత్ రెడ్డి పాత బుద్దులు మళ్ళీ బయటకి వస్తున్నాయి' అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు కోసం మోహలు చూసుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. విద్యుత్‌ కోతలు, తాగునీటి గోసలు ప్రారంభమయ్యాయని.. ఇదేనా మార్పు అంటే అని ప్రశ్నించారు. మిషన్ భగీరథను నిర్వహించే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.

Also Read: Telangana: ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు.. రద్దు చేయనున్నారా లేక?


అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్‌ మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ నాయకులే అధికారంలోకి వస్తామని అనుకోలేదు. అందుకే అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. అందరికీ అన్ని ఇస్తామన్నారు. అప్పుడేమో అందరికీ అన్ని ఇప్పుడేమో కొందరికి మాత్రమే కొన్ని ఇస్తామంటున్నారు' అని ఆరోపించారు. రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ, ఆడబిడ్డలకు రూ.2,500, ఇంట్లో అవ్వతాతలకు ఇద్దరికీ రూ.4 వేల చొప్పున ఫించన్‌ ఇస్తామనే హామీలను కేటీఆర్‌ గుర్తు చేశారు.


'కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలున్నారు. వాళ్లందరి నెలకు రూ.2,500 ఎప్పుడిస్తావు' అని రేవంత్ రెడ్డిని కేటీఆర్‌ ప్రశ్నించారు. 'రూ.500 రూపాయలకే సిలిండర్ అంటే.. కోటి 24 లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి… వాళ్లందరూ ఎదురుచూస్తున్నారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అందరికీ అన్ చెప్పి ఇప్పుడు కొందరికే అంటున్నారు' అని గుర్తు చేశారు. 'వంద రోజుల పాటు ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకున్నాం. శ్రీకృష్ణుడు  శిశుపాలుడి 100 తప్పులు లెక్కపెట్టినట్లు ఆగుదామనుకున్నాం. కానీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే మన పార్టీపై, పార్టీ అధినేత కేసీఆర్‌పై అడ్డగోలుగా విమర్శలు చేశారు' అని వివరించారు.


నిస్తేజంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు భరోసానిస్తూ కేటీఆర్‌ మాట్లాడుతూ.. 'కార్యకర్తలు ఎలాంటి పదవులు ఆశించకుండా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం సంవత్సరాల పాటు కష్టపడి పని చేశారు. వారందరికీ భవిష్యత్తుపైన భరోసా ఉంది. నమ్మకం ఉంది' అని తెలిపారు. పార్టీ నాయకులు కార్యకర్తలను ఒక్క సంవత్సరం కాపాడుకుంటే ఆ కార్యకర్తలే నాయకులను కాపాడుకుంటారని పేర్కొన్నారు. వచ్చిపోయే ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నా… తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కరే అని ప్రకటించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చరిత్రను ఎవరు చెరిపేయలేరని స్పష్టం చేశారు. 


బీజేపీపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. 'మోడీ హవా లేదు.. ఏంలేదు. పాలమూరు- రంగారెడ్డికి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని ప్రధాని మోదీ గురించి మనం ఎందుకు ఆలోచించాలి. మన కృష్ణా నదిపై ఉన్న నీళ్లన్ననింటిని కేఆర్ఎంబీకి అప్పజెప్పి, ఢిల్లీ వాళ్ల చేతిలో పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి. నల్లగొండలో మన పార్టీ మీటింగ్ పెడితే దెబ్బకు అసెంబ్లీలో తీర్మానం పెట్టి కెఆర్ఎంబికి ఇయ్యలేనని తీర్మానం పెట్టిండు' అని వివరించారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బకొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 


'ఏ రోజు అయినా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాపాడబడతాయి' అని కేటీఆర్‌ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించి పూర్వవైభవాన్ని సాధించుకుందాం అని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కారును వంద కిలోమీటర్ల స్పీడ్‌తో నడిపిద్దామని చెప్పారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని మళ్లీ గెలిపిస్తారన్న విశ్వాసం ఉందని చెప్పి ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి