హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ భావించినప్పటికీ.. పలు సాంకేతిక కారణాల రీత్యా అది సాధ్యపడకపోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగానే నవంబర్ 23 నుంచి ధరణి పోర్టల్‌పై వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ప్రారంభించడానికి అధికార యంత్రాంగం కూడా డిజిటలైజేషన్ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది. కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుసరించాల్సిన విధివిధానాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ దాఖలైన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం రిజిస్ట్రేషన్స్‌పై స్టే విధించిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే అంశం ఈ నెల 23న హైకోర్టులో మరోసారి విచారణకు రానుంది. హైకోర్టులో ( Telangana High court ) అభ్యంతరాలకు సమాధానం చెప్పి కోర్టును ఒప్పిస్తే తప్ప.. రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ ప్రారంభించడానికి వీలు లేదు. ఒకవేళ 23నే కోర్టు నుంచి ఏ అభ్యంతరాలు లేకుండా అనుమతి పొందినట్టయితే, ప్రభుత్వం అనుకున్న విధంగా అదే రోజున నాన్-అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ ( Non-agricultural lands registration ) ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా అభ్యంతరాలకు సమాధానం చెప్పిన తర్వాతే ముందుకు వెళ్లాలని కోర్టు చెప్పినా.. లేక తదుపరి విచారణను మరో రోజుకు వాయిదా వేసినా.. షెడ్యూల్ ప్రకారం 23 నుంచి ధరణి పోర్టల్‌పై ( Dharani portal ) ప్రారంభం కావాల్సి ఉన్న రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ మరో రోజుకు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై మరో రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.