తెలంగాణలో ప్రతీ గ్రామానికీ కనీసం ఓ పంచాయితీ కార్యదర్శి ఉండాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. ఈ క్రమంలో దాదాపు ఖాళీగా ఉన్న 9,200 పంచాయితీ కార్యదర్శి పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఓ వారంలోగా నోటిఫికేషన్ ఇచ్చి... రెండు నెలల్లో పోస్టులు భర్తీ పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను కోరారు. కొత్తగా పంచాయితీ కార్యదర్శి పోస్టుకి నియామకం అయ్యే వ్యక్తికి మూడేళ్లు ప్రొబేషనరీ పిరియడ్ ఉంటుందని కేసీఆర్ అన్నారు. ఉద్యోగ క్రమబద్దీకరణ అనేది పనితీరు బట్టే ఉంటుందని.. సరిగ్గా విధులు నిర్వహించనివారికి క్రమబద్దీకరణ ఉండదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యదర్శుల నియామకం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ పంచాయితీ రాజ్ కార్యదర్శి ఉద్యోగాలకు సంబంధించిన విధి విధానాలు వెంటనే రూపొందించాలని ఆయన ఆ శాఖను ఆదేశించారు. కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పంచాయతీ రాజ్‌ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ పాల్గొన్నారు. 


ప్రస్తుతం తెలంగాణలో 12,751 గ్రామ పంచాయితీలు ఉండగా.. అందులో 3,562 పంచాయితీలకు మాత్రమే కార్యదర్శలు ఉన్నారు. గతంలో ఒక పంచాయితీ కార్యదర్శే ఖాళీలు భర్తీ అవ్వనప్పుడు.. మరో పంచాయితీకి కూడా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించేవారు. అయితే కేసీఆర్ తాజా ఉత్తర్వుల ప్రకారం ఇన్‌ఛార్జ్ పంచాయితీ కార్యదర్శి విధానానికి స్వస్తి పలకాలని అన్నారు. ప్రతి గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి కచ్చితంగా ఉండాల్సిందేనని.. ఎట్టి పరిస్థితిలోనైనా నియామకాలు జరిగి తీరాలని ఆయన తెలిపారు. ప్రొబేషన్ సమయంలో కార్యదర్శికి నెలకు రూ.15 వేల చొప్పున జీతం ఇవ్వాలని కేసీఆర్ తెలిపారు.